నలుగురు మాజీ కౌన్సిలర్లు బరిలో..
నూజివీడు: నూజివీడు మున్సిపాలిటీలో టీడీపీకి రెబల్స్ సెగ తగిలింది. మంత్రి సీట్లు కేటాయించకపోవడంతో నలుగురు మాజీ కౌన్సిలర్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఈ నలుగురిలో ఇద్దరు తాజా మాజీలు కాగా, మరో ఇద్దరు గతంలో కౌన్సిలర్లు పనిచేసిన వారు. వీరు బరిలోకి దిగడంతో టీడీపీ వార్డు అభ్యర్థుల విజయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 36 వార్డులుండగా జనసేన 7 వార్డుల్లోను, బీజేపీ 1 వార్డులోను, టీడీపీ 28 వార్డుల్లో పోటీ చేస్తోంది. 36వ వార్డు నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థి గొల్లు దుర్గాదేవి ప్రచారంలో దూసుకెళ్తోంది. ఆమె గతంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఆమెకు టికెట్ కేటాయించకపోవడతో ఎలాగైనా టీడీపీ అభ్యర్థిని ఓడించాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వార్డులో ఎన్నికల కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. అలాగే తాజా మాజీ కౌన్సిలర్ నడకుదురు గిరీష్‌కుమార్‌కు కూడా సీటు ఇవ్వకపోవడంతో 34వ వార్డు నుంచి, మరో తాజీ మాజీ కౌన్సిలర్ కొమ్మని విజయ ఆశించిన 24వ వార్డును జనసేనకు కేటాయించడంపై ఆమె తీవ్ర అసంతృప్తికి గురై అదే వార్డు నుంచి టీడీపీ రెబల్స్‌గా దిగారు. ఈమె ప్రభావం వల్ల జనసేన అభ్యర్థిలకు గండి పడుతుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే 31వ వార్డు నుంచి టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ రిమ్మనపూడి నాగమణి రెబల్‌గా బరిలో నిలిచారు.


