● నామినేషన్ల ఉపసంహరణ పూర్తి
● కూటమిలో ముగిసిన బుజ్జగింపులు, ఉపసంహరణలు
సాక్షి ప్రతినిధి,ఏలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో తుది జాబితా సన్నద్ధమైంది. కూటమి పార్టీలో పొత్తుల పేరుతో సీట్ల సర్దుబాట్లు, రెబల్స్‌ను బుజ్జిగింపు పర్వాలు, తాయిలాల హామీలతో కూటమి సర్దుబాటు పూర్తికాగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల్లో అన్ని స్థానాల్లో పోటీకి సన్నద్ధమైంది. ఏలూరు జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలు, పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీల్లో అభ్యర్థుల లెక్కలు తేల్చి తుది జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.
ఏలూరు మేయర్ బరిలో 9 మంది..
ఏలూరు నగరపాలక సంస్థలో మేయర్ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి గంటా మోహనరావు, కూటమి అభ్యర్థి, జనసేన నేత రెడ్డి అప్పలనాయుడుతో పాటు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి 9 మంది బరిలో నిలిచారు. అలాగే 62 డివిజన్లకు సంబంధించి 164 మంది అభ్యర్థులు బరిలో కొనసాగుతున్నారు. 334 నామినేషన్లలో 169 నామినేషన్ల ఉపసంహరణ, ఒక నామినేషన్ అనర్హత వేటుకు గురైంది.
● నూజివీడులో.. నూజివీడు మున్సిపాల్టీలో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా కంచమర్ల లవకుమార్, టీడీపీ అభ్యర్థి బర్రె ఇళయరాజాతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో నిలిచారు. ఇక 36 డివిజన్లల్లో 81 మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
● జంగారెడ్డిగూడెంలో.. జంగారెడ్డిగూడెం ము న్సిపాల్టీలో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా మేకా సత్యవతి, టీడీపీ అభ్యర్థిగా రొంగల అనూషతో పాటు మరో ఇద్దరు బరిలో నిలిచారు. 32 వార్డులకు 78 మంది బరిలో ఉండగా 32 వార్డుల్లో వైఎస్సార్సీపీ, 22 వార్డుల్లో టీడీపీ, 9 వార్డుల్లో జనసేన, ఒక వార్డు బీజేపీ, 12 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
● నరసాపురంలో.. నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థులుగా వైఎస్సార్సీపీ నుంచి కావలి రామసీత, కూటమి నుంచి కొత్తపల్లి శైలజతో పాటు మరొకరు బరిలో నిలిచారు. 36 వార్డులకు 91 మంది పోటీలో నిలిచారు. వైఎస్సార్సీపీ 36 వార్డుల్లో, జనసేన 17 వార్డులు, టీడీపీ 17, బీజేపీ రెండు స్థానాల్లో పోటీల్లో నిలిచింది.
● ఆకివీడులో.. ఆకివీడు నగర పంచాయతీలో వైఎస్సార్సీపీ నుంచి చైర్పర్సన్ అభ్యర్థిగా మన్నే లలితాదేవి, కూటమి నుంచి ఎండీ నిలోఫర్, కాంగ్రెస్ నుంచి గంధం పార్వతి పోటీలో నిలిచారు. 28 వార్డులకు 64 మంది కౌన్సిలర్ అభ్యర్థులు తుది జాబితాలో ఖరారై బరిలో నిలిచారు.


