ఈవీఎం గోడౌన్ తనిఖీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్‌ను బుధవారం కలెక్టర్ తనిఖీ చేశారు. భదత్రా ఏర్పాట్లను పరిశీలించారు. ఇన్‌చార్జి డీఆర్వో ఎం.ముక్కంటి ఉన్నారు.
ద్వారకాతిరుమల: ఎన్నికల నామినేషన్ల తొలిరోజే అధికార పార్టీ నేతల అత్యుత్సాహం చర్చనీయాంశమైంది. పోలీసులపై కొందరు తెలుగు తమ్ముళ్లు వాగ్వాదానికి దిగారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో ప్రతిపాదకులు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా.. పోలీసులు వివరంగా చెబుతున్నా పట్టించుకోకుండా రగడ చేశారు. అదే సమయంలో వారితో వచ్చిన ఇద్దరు మహిళలు పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడం అక్కడి పరిస్థితిని మరింత వేడెక్కించింది. వివరాల్లోకి వెళితే. ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో ద్వారకాతిరుమల ఎంపీడీఓ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి సుమారు 100 అడుగుల దూరంలో పోలీస్‌స్టేషన్ సమీపాన రహదారిపై బారికేడ్లు పెట్టారు. ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో పర్యవేక్షణ చేపట్టారు. నామినేషన్ వేసే అభ్యర్థులు, వారి ఇద్దరు ప్రతిపాదకులు, డమ్మీ అభ్యర్థులను మాత్రమే లోపలికి అనుమతించారు. ఈ క్రమంలో పంగిడిగూడెం నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా బైక్ ర్యాలీగా చేరుకున్నారు. దీంతో అక్కడికి వచ్చిన కొందరు తెలుగు తమ్ముళ్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో పాటు మాజీ ఎంపీపీ, మరో బీసీ సామాజికవర్గ నాయకుడిని ఎలా అనుమతించారంటూ పోలీసులను నిలదీశారు. వారు అభ్యర్థుల ప్రతిపాదకులని ఎస్సై, సి బ్బంది స్పష్టం చేసినా వాగ్వాదానికి దిగారు. ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా పోలీసులు తీసుకున్న చర్యలపై ఇలా అభ్యంతరం వ్యక్తం చేయడం అక్కడున్నవారిని విస్మయానికి గురిచేసింది. అధికారం ఉందన్న అహంతోనే వారు ఇలా వ్యవహరించారని పలువురు మండిపడ్డారు.


