వరుడైన ‘వైకుంఠనాథుడు’ | - | Sakshi
Sakshi News home page

వరుడైన ‘వైకుంఠనాథుడు’

Oct 22 2026 1:09 AM | Updated on Oct 22 2026 1:09 AM

వరుడైన ‘వైకుంఠనాథుడు’ బ్రహ్మోత్సవాల్లో నేడు

● రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ, అనంతరం హంసవాహన సేవ.

● ప్రత్యేక అలంకారం : కాళీయమర్దనం.

ద్వారకాతిరుమల: కలియుగ వైకుంఠనాధుడు కొలువైన చిన్నతిరుపతి క్షేత్రంలో శ్రీవారి ఆశ్వీయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయు వేడుక అట్టహాసంగా జరిగింది. సర్వాభరణ శోభితుడై.. నుదుట కల్యాణ తిలకం, బుగ్గన చుక్కతో.. దివ్యమంగళ స్వరూపుడైన శ్రీవారు పెండ్లి కుమారుడిగా, పద్మావతి, ఆండాళ్‌ అమ్మవార్లు పెండ్లి కుమార్తెలుగా శోభిల్లారు. తొలుత స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి అర్చకులు తొళక్క వాహనంపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిత్య కల్యాణ మండపం వద్దకు అట్టహాసంగా తీసుకువచ్చారు. అక్కడ పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై ఏర్పాటు చేసిన స్వర్ణ సింహాసనంపై ఉభయ దేవేరులతో శ్రీవారిని వేంచేపు చేసి విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణలు.. మంగళ వాయిద్యాల నడుమ పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేసే వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఈఓ సతీమణి భాగ్యలక్ష్మి స్వామి, అమ్మవార్లకు పూలు, పండ్లు సమర్పించారు. ఆ తరువాత అర్చకులు, పండితులకు నూతన వస్త్రాలను అందజేశారు. భక్తుల గోవింద నామస్మరణల నడుమ సాగిన ఈ వేడుక భక్తకోటికి కనువిందు చేసింది. మరోవైపు శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. రాత్రి గజవాహనంపై స్వామివారి తిరువీధి సేవ అంగరంగ వైభవంగా సాగింది. ఆలయ ముఖ మండపంలో స్వామివారు శ్రీ భూ సమేత మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం డీఈఓ వై.భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

చిన్నతిరుపతిలో ప్రారంభమైన దివ్య బ్రహ్మోత్సవాలు

పెండ్లి కుమారుడిగా శ్రీవారు, పెండ్లి కుమార్తెలుగా అమ్మవార్లు ముస్తాబు

గజ వాహనంపై గోవిందుడి విహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement