తణుకు అర్బన్ : వెంకటరాయపురంలోని ది ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ సంస్థలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్యుతరామయ్య అధ్యక్షతన జరిగిన వేడుకల్లో సంగీత సాహిత్య వేద ప్రవీణ శ్రుతి వాగ్గేయ కళానిధి డా.యనమండ్ర శ్రీనివాసశర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజానికి గుర్తింపు భాష ద్వారా లభిస్తుందని, ఆంధ్ర భాష ఆంధ్రత్వం ద్వారా తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. సంస్థ ఎండీ అచ్యుతరామయ్య మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ (ఏఐ) కారణంగా ప్రస్తుతం కోల్పోతున్న ఉద్యోగావకాశాలను ఎదుర్కొనేందుకు యువత ముందుగానే సన్నద్ధం కావాలన్నారు. సమాజంలో ప్రతిఒక్కరూ పర్యావరణం కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సంస్థ అడిషినల్ సెక్రటరీ పీవీఎస్ విశ్వనాథ్‌కుమార్, జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్) ఎ.సాంబశివరావు, ఉద్యోగులు, పిల్లలు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: రాష్ట్రంలో నిర్వహిస్తున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో గౌడ కులస్తులకు తెలుగుదేశం పార్టీ ఒక్క మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్ స్థానం కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని జిల్లా గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చిటికెన శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అనంతపురం కార్పొరేషన్ మేయర్‌గా రమేష్ గౌడ్‌ను, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్‌గా మేక సత్యవతిని ప్రకటించి గౌడ కులస్తులకు తగిన గుర్తింపునిచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో గౌడ కులస్తులంతా స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. మున్సిపల్ చైర్మన్, మేయర్ అభ్యర్థులతో పాటు బీసీ వర్గానికి చెందిన ఇతర మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను గెలిపించేందుకు మన కమ్యూనిటీ మొత్తం వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
ఉండి: ఈ నెల 15వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చిలుకూరు గ్రామానికి చెందిన సింగారపు సత్యసాయిదుర్గప్రసాద్ (27) గత పదేళ్లుగా తన మేనమామ తీపర్తి శ్రీనివాస్ ఇంటివద్దనే ఉంటున్నాడు. ఈ నెల 15వ తేదీన ఇంట్లో సరుకులు తెచ్చేందుకు భీమవరం వెళ్లి తిరిగి వస్తుండగా మహదేవపట్నం రోడ్డులోని ఓ ఐస్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో అతని తలలోపల తీవ్ర గాయమైంది. దీంతో అతడిని భీమవరంలోని ఓ పైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 20వ తేదీ సాయంతం మృతి చెందాడు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారంతో పాటు మృతుని మేనమామ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ ఏసయ్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పెంటపాడు : పెంటపాడు కుమ్మరిపుంతలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెంటపాడుకు చెందిన వెలగల సత్యవతి, గణపతిరెడ్డి దంపతుల ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఆదివారం సత్యవతి పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెర్వులోని బంధువుల ఇంటికి వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి ప్రధాన తలుపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో ఆమె బుధవారం రాత్రి పెంటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కొద్దిపాటి నగదుతో పాటు సుమారు రూ. లక్ష విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించామని, బాధితురాలి నుంచి పూర్తి వివరాలు సేకరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
కై కలూరు : డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న కుమార్తె కనిపించడం లేదంటూ తల్లి కై కలూరు రూరల్ పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గోనెపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ తమ కుమార్తె కనిపించడం లేదని, ఇటీవల ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచమమైన కర్నూలుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తితో వెళ్లిపోయినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాంబాబు చెప్పారు.


