పెట్రోల్‌ దాడిలో మేనత్త కుమారుడే సూత్రధారి | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ దాడిలో మేనత్త కుమారుడే సూత్రధారి

Oct 22 2026 1:09 AM | Updated on Oct 22 2026 1:09 AM

కలిదిండి(కై కలూరు) : వైఎస్సార్‌సీపీ కలిదిండి మండల మాజీ ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు కోరుకొల్లు నివాస గేటు వద్ద ఈ నెల 1న పెట్రోల్‌తో నిప్పు పెట్టిన కేసులో అమెరికాలో ఉంటున్న ఆయన మేనత్త కుమారుడు సీతాల శ్రీనివాస చక్రవర్తి ప్రధాన ముద్దాయిగా తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని మంగళవారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కై కలూరు స్టేషన్‌లో రూరల్‌ సర్కిల్‌ సీఐ వి.రవికుమార్‌, కలిదిండి ఎస్సై పవన్‌కుమార్‌ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఉమామహేశ్వరరావు, శ్రీనివాస చక్రవర్తి మధ్య విభేదాలు ఉన్నాయి. శ్రీనివాస చక్రవర్తి అమెరికా వెళ్లకముందు కోరుకొల్లులో కొమ్మోజు రూపేష్‌కుమార్‌ అమ్మమ్మ ఇంటి సమీపంలో నివాసం ఉండేవారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య స్నేహం కుదిరింది. చక్రవర్తి ఆర్థికంగా రూపేష్‌కు సహాయం చేశాడు. రూపేష్‌ ఏలూరులోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో టీమ్‌ లీడర్‌గా పనిచేశాడు; అతని వద్ద వేముల ఏసు పనిచేశాడు. ఈ క్రమంలో, చక్రవర్తి కోరుకొల్లులోని చందన ఉమామహేశ్వరరావు నివాసం వద్ద పెట్రోలు పోసి భయపెట్టాలని, ఇందుకు రూ.20,000 ఇస్తానని చెప్పడంతో.. రూపేష్‌, ఏసు, రావడ రాముతో కలిసి రెక్కి నిర్వహించారు. ఏలూరులో మూడు మంకీ మాస్క్‌లు కొనుగోలు చేశారు. ద్విచక్ర వాహనం నంబరు ప్లేటు కనిపించకుండా స్టిక్కర్‌ అంటించారు. ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్లలేదు. అధునాతన సాంకేతిక సీసీ కెమెరాలు, చక్రవర్తితో రూపేష్‌ జరిపిన వాట్సాప్‌ చాటింగ్‌ల ఆధారంగా ఈ కేసును ఛేదించినట్లు సీఐ తెలిపారు. కేసును విజయవంతంగా చేధించిన ఎస్సై, సిబ్బందికి జిల్లా ఎస్పీ రివార్డులు ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement