తణుకు అర్బన్ : తణుకు రైల్వేస్టేషన్‌లో లిఫ్టు నిర్మాణ పనులు పూర్తిచేయాలని కోరుతూ సీనియర్ సిటిజన్స్, శ్రీచిట్టూరి ఇంద్రయ్య డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణ వాకర్స్ నాయకులు బుధవారం ఎలక్ట్రికల్ లోకో షెడ్ విజయవాడ సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరు శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. తణుకు రైల్వేస్టేషన్‌లో బుధవారం నిర్వహించిన రైల్ జన్ సమ్‌వాద్ కార్యక్రమానికి హాజరైన ఆయనను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు వాకర్స్ నాయకుడు కోడూరి ఆంజనేయులు తెలిపారు. లిఫ్టు నిర్మాణ పనులు సగంలోనే నిలిచిపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే లిఫ్టు పనులు పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. అలాగే పైడిపర్రువైపు నుంచి తణుకు రైల్వే స్టేషన్ వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరుచేయాలని, రెండో ఫ్లాట్‌ఫామ్‌పై వాష్‌రూమ్, వెయిటింగ్ హాలు, తాగునీరు ఏర్పాటుచేయాలని, సంబల్పూర్ టు ఈరోడ్, విశాఖ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వెళ్లే ప్రత్యేక రైళ్లను తణుకు స్టేషన్‌న్‌లో హాల్ట్ ఇవ్వాలని కోరారు. భీమవరం అడిషినల్ డివిజనల్ ఇంజనీర్ ఆర్.శంకరరావు, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరు వడ్లమాని పార్వతి తదితరులు పాల్గొన్నారు.


