వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి
నరసాపురం: వశిష్ట గోదావరిపై నరసాపురంలో వంతెన నిర్మాణం కల త్వరలోనే సాకారం కానుంది. రూ. 299 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ వంతెన పనుల టెండర్లను జైపూర్ చెందిన బీఆర్‌ఎన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో రెండు నెలల క్రితం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లు పిలిచింది. మొత్తం 6 బిడ్లు రాగా, అత్యల్పంగా రూ.299 కోట్లకు బిడ్ దాఖలు చేసిన బీఆర్‌ఎన్ సంస్థకు పనులు ఖరారు అయ్యాయి. న్యూఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ కార్యాలయంలో బిడ్లు ఓపెన్ చేసి, ప్రాథమిక లాంఛనాలు ప్రారంభించారు. 2022లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణం, బైపాస్ రోడ్డు, స్థల సేకరణతో కలిపి మొత్తం రూ. 650 కోట్లతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసింది. స్థల సేకరణ కోసం రూ. 60 కోట్లను కూడా మంజూరు చేసి ఆ ప్రక్రియను పూర్తి చేసింది. అయితే, స్థల సేకరణపై కూటమి నాయకులు కోర్టులను ఆశ్రయించడంతో ఈ ప్రాజెక్టు సుప్రీంకోర్టు వరకు వెళ్లి నిలిచిపోయింది. ఇటీవల సుప్రీంకోర్టు ఆ కేసులను కొట్టివేయడంతో వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది.
కేంద్రం సహకారంతో
బైపాస్ హైవే రూపకల్పన
నరసాపురం మండలం రాజుల్లంక గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూనుకుంది. కోనసీమ జిల్లా చించినాడ మీదుగా నరసాపురం నుంచి ఒంగోలు వరకు ఉన్న 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించడం ద్వారా ఈ వంతెనను అనుసంధానించనున్నారు. కోనసీమ జిల్లా శివకోడు నుంచి టేకిశెట్టిపాలెం మీదుగా ఉన్న స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చారు. అక్కడ నుంచి రామేశ్వరం మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజుల్లంక, వైఎస్ పాలెం, సీతారామపురంల మీదుగా 216 జాతీయ రహదారికి కలిపేలా 25 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును రూపొందించారు. రామేశ్వరం – రాజుల్లంక మధ్య వశిష్ట గోదావరిపై 380 మీటర్ల మేర ఈ వంతెన నిర్మాణానికి అంచనాలు తయారు చేశారు. స్థల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రూ 60 కోట్లు మంజూరు చేసి, స్థల సేకరణ పూర్తి చేసింది. అయితే కూటమి నేతలు కోర్టులకెక్కి పనులు ముందుకు కదలకుండా అడ్డంకులు సృష్టించారు. చివరకు గత ప్రభుత్వ నిర్ణయం మేర వంతెన నిర్మాణం సాగబోతుంది.
వశిష్ట గోదావరి వంతెన పనులకు రూ. 299 కోట్లతో టెండర్లు ఖరారు
ఫలించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కృషి
కోర్టులను ఆశ్రయించి అడ్డగించిన కూటమి నాయకులు
కేసులను కొట్టేయడంతో పనులకు శ్రీకారం చుట్టిన ఎన్‌హెచ్‌ఏఐ
ఈ వంతెన నిర్మాణం వల్ల తీరప్రాంత అభివృద్ధి, మత్స్య, కొబ్బరి ఎగుమతులతో పాటు ఓఎన్‌జీసీ కార్యకలాపాలకు ఎంతో మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బ్రిటీష్ కాలం నాటి ఈ డిమాండ్ ప్రాధాన్యతను గుర్తించిన జగన్, వెంటనే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. స్టేట్ హైవేను 216 జాతీయ రహదారి బైపాస్‌గా మార్చాలని, మధ్యలో గోదావరిపై వంతెన నిర్మించాలని కోరారు. దానికి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి ఆమోదం తెలుపడంతో పనులకు మార్గం సుగమమైంది.


