ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): యువతను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి అన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో శనివారం పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాల అమలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు–నియంత్రణ, ఆరోగ్య సంరక్షణ, చట్టపరమైన అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆర్థిక ఉన్నతి కోసం అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, నిరుపేదలు ఈ పథకాలపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇన్‌చార్జి జిల్లా కలెక్టరు ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించడంలో ఏలూరు జిల్లా ముందంజలో ఉందన్నారు. ముందుగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ, మిషన్ శక్తి (వన్ స్టాప్ సెంటర్), ఈగల్ హెల్ప్ లైన్ (1972), మెప్మా, గిరిజన, దివ్యాంగుల సంక్షేమం తదితర శాఖలకు చెందిన 12 స్టాల్స్‌ను ప్రారంభించారు. డీఆర్‌డీఏ ద్వారా 10,086 సంఘాలలోని 61,120 మంది సభ్యులకు రూ. 889.93 కోట్ల నమూనా చెక్కును అందజేశారు. మెప్మా ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను 591 స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ. 75.52 కోట్ల రుణాల నమూనా చెక్కును అందించారు. సదస్సులో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, కళాకారుల బుర్రకథలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, ఏఎస్పీ వై. ప్రసాదరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి తదితరులు పాల్గొన్నారు.


