కై కలూరు: కూటమి ఎత్తుగడలను తిప్పికొడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయాన్నే ధ్యేయంగా ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) పిలుపునిచ్చారు. కైకలూరులోని సీతారామ ఫంక్షన్ హాలులో శనివారం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సతీమణి లక్ష్మీకిరణ్, కారుమూరి సునీల్ సతీమణి కీర్తి హాజరయ్యారు. సమావేశంలో జిల్లాలో మొదటి సభ్యత్వ గుర్తింపు కార్డును సునీల్ సతీమణి కీర్తికి డీఎన్నార్ అందించారు. అనంతరం వెన్నుపోటు పోస్టర్‌ను ఆవిష్కరించారు.
కూటమి ప్రభుత్వంపై నేతల తీవ్ర ధ్వజం
ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు వినియోగించిన ఏలూరు ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కూటమి పాలనను ప్రశ్నించినందుకే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌లను అరెస్టు చేశారని మండిపడ్డారు. బాధితులకు పార్టీ నిరంతరం అండగా ఉంటుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గురించి ప్రస్తావిస్తూ వైఎస్సార్‌సీపీ హయాంలో అనుమతులు పొందిన గోపవరం విద్యుత్ సబ్‌స్టేషన్, పెద్దింట్లమ్మ వారధి, భోగేశ్వరం ఆలయ పనులు, కొల్లేరు రహదారులను తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కామినేని గతంలో మంత్రిగా ఉన్నప్పుడే 22ఏ జాబితాలో భూములను చేర్చారని, కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి కుటుంబానికి అర ఎకరం కేటాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేయడానికి కామినేని సిద్ధమా? అని సవాల్ విసిరారు.
ధరల స్థిరీకరణ నిధి ఏది?
ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ రూ.1,400 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. అమరావతిపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం కై కలూరులో పారిశుద్ధ్యాన్ని విస్మరించడంతో అంటురోగాలు విజృంభిస్తున్నాయన్నారు. కారుమూరి కుటుంబాన్ని ఎదుర్కోలేక అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని, వారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కంటతడి పెట్టిన కారుమూరి భార్య
కారుమూరి నాగేశ్వరరావు భార్య లక్ష్మీకిరణ్ తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ... ‘నా భర్త, కుమారుడిని అన్యాయంగా అరెస్టు చేశారు. చిన్న పాపతో కలసి ఇద్దరం ఉంటున్నాం. పార్టీ మాకు అండగా నిలిచింది, వారిద్దరూ త్వరలోనే తిరిగి వస్తారు’ అని పేర్కొన్నారు. సునీల్ సతీమణి కీర్తి మాట్లాడుతూ... తమ కుటుంబం దేనికీ భయపడేది లేదని, తన భర్త క్లీన్‌చిట్‌తో తిరిగి వస్తారని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు నూకపయ్యి సుధీర్‌బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీరరాజు, ఎంపీపీలు పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, రామిశెట్టి సత్యనారాయణ, చందన ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ముదిరాజుల సంఘ విభాగ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు, నాయకులు గంటా సంధ్య, గాదిరాజు మణికంఠ వర్మ, ఈడేపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వెన్నుపోటు పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు
సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
ఏలూరు జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్


