‘యూజీసీ ప్రాజెక్టుకు భూములు ఇవ్వం’ | - | Sakshi
Sakshi News home page

‘యూజీసీ ప్రాజెక్టుకు భూములు ఇవ్వం’

Sep 20 2026 1:03 AM | Updated on Sep 20 2026 1:03 AM

‘యూజీసీ ప్రాజెక్టుకు భూములు ఇవ్వం’ ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ పుట్టగొడుగుల పెంపకం లాభదాయకం 5న ‘బతుకు పోరాట గర్జన’

చింతలపూడి: సస్యశ్యామలమైన వ్యవసాయ భూములను అండర్‌గ్రౌండ్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌ (యూసీజీ) ప్రాజెక్టు కోసం ఏ ప్రైవేటు కంపెనీకీ ఇచ్చేది లేదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. చింతలపూడి మండలం నామవరం దుర్గమ్మ గుడి వద్ద శనివారం వెంకటాపురం, శెట్టివారిగూడెం, నామవరం గ్రామాల రైతులు, ప్రజలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో యూసీజీ ప్రాజెక్టుకు భూములు ఇవ్వకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ రిలయన్స్‌ సంస్థ చేపట్టే ఈ ప్రాజెక్టు వల్ల తీవ్ర పర్యావరణ వినాశనం జరుగుతుందని హెచ్చరించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రైవేటు ప్రాజెక్టులకు 80 శాతం మంది రైతుల ఆమోదం తప్పనిసరి అయినప్పటికీ, ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు కోసం 8,500 ఎకరాలు సేకరిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించడం దుర్మార్గమని మాజీ జెడ్పీటీసీ సీహెచ్‌ ఖాదర్‌బాబు వ్యాఖ్యానించారు. స్థానిక ఎంపీపీ రాంబాబు నాయక్‌, జెడ్పీటీసీ నీరజా సుధాకర్‌ మాట్లాడుతూ ప్రాజెక్టును రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు బొడ్డు వెంకటేశ్వరరావు, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, యర్రంశెట్టి రామకృష్ణారావు, రైతు నాయకులు సురనేని గోపీనాథ్‌, సీపీఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు, నాయకులు హరి, ఆదిశెట్టి ధర్మారావు, దొంత కృష్ణ, ఆర్‌.పి.ఎస్‌. నారాయణ, పాండురంగారావు, సత్యనారాయణ, జరపాల వెంకటేశ్వరరావు, ఆదిశెట్టి జగన్‌, సాదరబోయిన వరలక్ష్మి పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్సీ సహకార సంఘం కార్యనిర్వాహక సంచాలకుడు ఎం. ముక్కంటి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ అర్హత ఉన్నవారికి అసిస్టెంట్‌ టెక్నీషియన్‌ (ఏలూరు), కిసాన్‌ డ్రోన్‌ ఆపరేటర్‌ (అనంతపురం), ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌ (కాకినాడ), ఎలక్ట్రీషియన్‌–స్మార్ట్‌ ఎనర్జీ (శ్రీకాకుళం), సోలార్‌ పీవీ ఇన్‌స్టాలర్‌ (కడప), ల్యాబ్‌ టెక్నీషియన్‌ (విశాఖపట్నం), డిగ్రీ అర్హత ఉన్నవారికి ఏఐ డేటా ఇంజనీరింగ్‌ అనలిస్ట్‌ (విజయవాడ), జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ (ఒంగోలు) శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచిత భోజనంతో పాటు మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఉచిత వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 97013 55337, 97058 63666, 96402 94967 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

తాడేపల్లిగూడెం: పుట్టగొడుగుల పెంపకం లాభదాయకమని ఉద్యానవర్సిటీ వీసీ కె.ధనుంజయరావు అన్నారు. వెంకట్రామన్నగూడెంలో శనివారం నిర్వహించిన పుట్టగొడుగుల శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పుష్కలమైన పోషకాహార విలువలు కలిగిన, వాణిజ్యపరంగా లాభదాయకమైన పుట్టగొడుగుల పెంపకం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను పొందవచ్చన్నారు. ఈ శిక్షణకు 33 మంది హాజరయ్యారని కేవీకే హెడ్‌ సీహెచ్‌ కిరణ్‌కుమార్‌ అన్నారు. పుట్టగొడుగుల పెంపకంపై తెలుగులో రూపొందించిన కరపత్రాలను వీసీ ఆవిష్కరించారు.

భీమవరం: కల్లుగీత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 5న భీమవరం ఎకై ్సజ్‌ కార్యాలయం వద్ద నిర్వహించే బతుకు పోరాట గర్జనను జయప్రదం చేయాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి పిలుపునిచ్చారు. శనివారం భీమవరంలో కామన మునిస్వామి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సాంప్రదాయ కల్లుగీత వృత్తిపై వివక్ష చూపుతోందని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement