మత్స్యకారులు విలపింఛెన్‌ | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులు విలపింఛెన్‌

Sep 10 2026 1:21 AM | Updated on Sep 10 2026 1:21 AM

మత్స్యకారులు విలపింఛెన్‌

ధ్రువపత్రాలు తీసుకురావాలి

గడువు పెంచాలి

కై కలూరు : మత్స్యకారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం లబ్ధిదారులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. వయస్సు 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారులు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఎఫ్‌డీవో) సంతకాల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రోజూవారీ పనులు మానుకుని కిలోమీటర్లు ప్రయాణించి వస్తున్నా, అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. మరికొందరు కార్యాలయాల్లోనే గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. బుధవారం ఉదయం కై కలూరులో ఎఫ్‌డీవో అందుబాటులో లేకపోవడంతో దరఖాస్తుదారులు పడరాని పాట్లు పడ్డారు. దీనికి తోడు దరఖాస్తుల గడువు సమీపిస్తుండటం, మధ్యలో వరుసగా ప్రభుత్వ సెలవులు రావడం ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను మరింత కష్టతరం చేసింది.

ఏలూరు జిల్లాలో...

ఏలూరు జిల్లాలో మొత్తం 230 మత్స్యకార సొసైటీల్లో 22,000 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో కొల్లేరు ప్రాంతంలోని 151 సొసైటీలకు సంబంధించి 14,474 మంది సభ్యులు ఉన్నారు. ఒక్క కై కలూరు నియోజకవర్గంలోనే 65 సొసైటీల నుంచి దాదాపు 10,000 మంది సభ్యులు ఉన్నారు.

వరుస సెలవులతో ఆందోళన

మత్స్యకారుల కొత్త పింఛను దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. సొసైటీలో సభ్యుడిగా ఉండటంతో పాటు, మత్స్య, అటవీశాఖలు అందించిన ఫిషర్‌మెన్‌ లైసెన్సులు, ఆధార్‌, రేషన్‌ కార్డులు, ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్‌ పాస్‌పుస్తకం నకలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ నెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయకచవితి సందర్భంగా వరుస ప్రభుత్వ సెలవులు వచ్చాయి. కేవలం 15, 16 తేదీలు మాత్రమే దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. మరోపక్క, కై కలూరు మండలంలో 4 వేల మంది దరఖాస్తుదారులకు గాను, బుధవారం సాయంత్రం నాటికి కేవలం 360 దరఖాస్తులపై మాత్రమే సంతకాలు పూర్తయ్యాయి. ఈ వేగాన్ని చూస్తే, గడువులోగా మొత్తం ప్రక్రియ పూర్తవ్వడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వేధిస్తున్న సిబ్బంది కొరత

రాష్ట్రంలోనే మంచినీటి చేపల, రొయ్యల రెఫరల్‌ ల్యాబొరేటరీగా నిలిచిన కై కలూరు మత్స్యశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గతంలో గ్రామ మత్స్యశాఖ సహాయకులు (వీఎఫ్‌ఏ) 32 మంది విధులు నిర్వహించగా, వీరు ఆక్వా, సొసైటీ రైతులకు ఎంతో సహాయపడ్డారు. ప్రస్తుతం ఉద్యోగ సర్దుబాట్ల కారణంగా కేవలం 22 మందే మిగిలారు. కలిదిండి మండలంలో ఇద్దరు మాత్రమే వీఎఫ్‌ఏలు ఉండటం ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఇవే కాకుండా ఒక ఎఫ్‌డీవో, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, ల్యాబ్‌ అటెండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో ఇద్దరు అధికారులు ఏలూరు, కై కలూరుల్లో మూడు రోజుల చొప్పున విభజన పద్ధతిలో పనిచేస్తున్నారు. తక్షణమే స్పందించి ఖాళీలను భర్తీ చేయాలని మత్స్యకారులు, రైతులు కోరుతున్నారు.

మత్స్యకార సొసైటీల్లో సభ్యులు నిబంధనలో చూపించిన ధ్రువపత్రాలు తీసుకురావాలి. గురు, శుక్ర, మంగళ, బుధ వారాల్లో ఎక్కువ శాతం సభ్యులకు సంతకాలు చేసే అవకాశం ఉంది. ఆధార్‌ కార్డులో 50 ఏళ్లు దాటిన సభ్యులు మాత్రమే దరఖాస్తులు చేయాలి.

– సీహెచ్‌ గణపతి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఎఫ్‌డీవో), కై కలూరు

ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకంలో 50 ఏళ్లు దాటిన మత్స్యకార సొసైటీ సభ్యుల దరఖాస్తు గడవు పెంచాలి. ఈనెల 12, 13, 14న ప్రభుత్వ సెలవులు వచ్చాయి. చాలా మందికి నిబంధనలు తెలియవు. ఆన్‌లైన్‌ పక్రియ ఆలస్యం అవుతోంది.

– బంటుమిల్లి సాదు కొండయ్య, ఎంపీటీసీ సభ్యుడు, పల్లెవాడ

మత్స్యకార పింఛనుకు తిప్పలు

వరుస సెలవులతో తగ్గిన దరఖాస్తుల గడువు

సంతకాల కోసం ఫిషరీస్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

మొరాయిస్తున్న ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement