గోల్డ్‌లోన్‌ కుంభకోణం గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

గోల్డ్‌లోన్‌ కుంభకోణం గుట్టురట్టు

Sep 10 2026 1:21 AM | Updated on Sep 10 2026 1:21 AM

గోల్డ్‌లోన్‌ కుంభకోణం గుట్టురట్టు

జంగారెడ్డిగూడెం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో గోల్డ్‌లోన్‌ స్కామ్‌

176 ఖాతాల్లో బంగారం గోల్‌మాల్‌

ముగ్గురు బ్యాంకు అధికారుల అరెస్ట్‌

ఏలూరు టౌన్‌: జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో వెలుగు చూసిన గోల్డ్‌లోన్‌ కుంభకోణంలో దర్యాప్తు మరింత పుంజుకుంది. ఈ స్కామ్‌లో బ్యాంకు అధికారుల పాత్రపై లోతైన దర్యాప్తు చేపట్టగా.. వారు ప్రధాన నిందితుడితో కుమ్మకై ్క, ఖాతాదారులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. ఈ కేసులో ముగ్గురు బ్యాంకు అధికారులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జంగారెడ్డిగూడెం పోలీసులు వెల్లడించారు. ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

భారీ కుంభకోణం వివరాలు

ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జంగారెడ్డిగూడెం శాఖలో దాదాపు 6 కిలోల 449.50 గ్రాముల బంగారం మాయమైంది. ఖాతాదారులు గోల్డ్‌లోన్‌ కోసం కుదువపెట్టిన బంగారాన్ని అపహరించడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ మాయమైన బంగారం విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. ఎస్పీ శివకిషోర్‌ ప్రత్యేక చొరవతో.. జంగారెడ్డిగూడెం డీఎస్పీ బీహెచ్‌.వెంకటేశ్వర్లు, సీఐ ఎంవీ సుభాష్‌, ఎస్సైలు ఎన్‌.వీరప్రసాద్‌, ఎన్‌.కుటుంబరావు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఏడాది జూలై 10న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో గోల్డ్‌ అప్రైజర్‌గా పనిచేసిన జంగారెడ్డిగూడెం వెలమపేటకు చెందిన చలపాక రాజును మొదటి నిందితుడిగా (ఏ1) అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి 4.120 కిలోల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదుతో పాటు మొత్తం సుమారు రూ.5 కోట్ల 81 లక్షల 65 వేల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

బ్యాంకు అధికారుల పాత్ర కీలకం

ఈ కుంభకోణంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జంగారెడ్డిగూడెం శాఖకు చెందిన ముగ్గురు అధికారుల పాత్ర కీలకంగా మారినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం 176 గోల్డ్‌లోన్‌ ఖాతాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. గోల్డ్‌ అప్రైజర్‌ చలపాక రాజు.. తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను అక్రమంగా అపహరించి, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలను ఉంచినట్లు విచారణలో తేలింది. ఏ1 నిందితుడు చలపాక రాజు 2016 నుంచి గోల్డ్‌ అప్రైజర్‌ పనిచేస్తుండగా.. ఏ2 నిందితుడు కుమారపు భాస్కరరావు బ్రాంచ్‌ మేనేజర్‌గా 2025 మే నెల నుంచి, ఏ3 నిందితుడు తన్నేరు అజయ్‌బాబు బ్యాంకు జాయింట్‌ మేనేజర్‌గా 2025 అక్టోబర్‌ నుంచి పనిచేస్తున్నారు. క్రెడిట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జంగల సాయిరాజ్‌ను ఏ4 నిందితుడిగా నిర్ధారించారు. ప్రధాన నిందితుడు చలపాక రాజుతో పాటు ఈ బ్యాంకు అధికారులందరూ కుమ్మకై ్క ఖాతాదారులను మోసం చేసినట్లు ఎస్పీ శివకిషోర్‌ స్పష్టం చేశారు. ముగ్గురు అధికారులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సుభాష్‌, ఎస్‌ఐలు వీరప్రసాద్‌, కుటుంబరావు, ఏఎస్సై రాజేంద్రప్రసాద్‌, హెచ్‌సీ రాంబాబు, కానిస్టేబుళ్లు రమేష్‌, రామాంజనేయులు, జగదీష్‌, సీహెచ్‌.సత్యనారాయణ, మణికంఠ, రవికుమార్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement