భీమవరం: కాలుష్య నియంత్రణకు సాక్షాత్తు కలెక్టర్ చదలవాడ నాగరాణి జారీ చేసిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలో విచ్చలవిడిగా క్యారీబ్యాగ్స్ వినియోగం సాగుతుండగా.. మరోవైపు వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (పీఓపీ) విగ్రహాలను పూర్తిగా విడనాడాలన్న నిబంధనను బేఖాతరు చేస్తూ జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు, నరసాపురం తదితర ప్రాంతాల్లో భారీ గూడారాలు ఏర్పాటు చేసి, అధిక సంఖ్యలో.. రకరకాల ఆకృతుల్లో చిన్న, పెద్ద సైజు విగ్రహాలను తయారుచేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువవడం విశేషం.
పర్యావరణానికి ముప్పు
జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. కొన్ని గ్రామాల్లో అయితే మూడు, నాలుగు చోట్ల ప్రత్యేకంగా మండపాలు ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు పూజలు జరుపుతారు. అయితే, గత కొన్నేళ్లుగా యువత 90 శాతం వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలనే ఎంచుకుంటున్నారు. ఇవి తక్కువ బరువుతో, ఆకర్షణీయమైన రంగులతో, విభిన్న ఆకారాల్లో లభిస్తుండటంతో వీటి వైపే మొగ్గు చూపుతున్నారు.
రసాయనాలు, రంగులతో ప్రమాదం
అయితే, ఈ విగ్రహాల తయారీలో జిప్సం, గంధకం, మెగ్నీషియం, పాదరసం, కాడ్మియం వంటి హానికారక రసాయనాలను వినియోగిస్తున్నారు. వీటితో తయారుచేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు.. ఆ రసాయనాలు జలవనరులలో కలిసి అందులోని ఆక్సిజన్ శాతాన్ని తగ్గించడంతోపాటు ఆమ్లత్వాన్ని విపరీతంగా పెంచుతాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ ఏళ్లు గడిచినా భూమిలో కరిగిపోయే అవకాశం లేదు. రంగుల కోసం సిలికా, జింక్, గాజు పొడులను వాడటం వల్ల జలచరాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. ఎరుపు రంగు కోసం వాడే మెర్క్యూరీ సల్ఫేట్ వల్ల చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే నలుపు రంగు కోసం రెడ్ ఆకై ్సడ్, కాడ్మియం; నీలం రంగు కోసం క్రోమియం, అయోడైడ్; గులాబీ రంగు కోసం పొటాషియం డైక్రోమేట్ వంటి రసాయనాలను వాడటం వల్ల ఉబ్బసం (ఆస్తమా), అలెర్జీలు, తీవ్రమైన చర్మవ్యాధులు బారిన పడే ప్రమాదముంది.
వినాయక చవితి అసలు పరమార్థం ఇదే
హిందువులు నిర్వహించే ప్రతి శుభకార్యాన్ని విఘ్నేశ్వర పూజతోనే ప్రారంభిస్తారు. వినాయకుడిని వివిధ రకాల పవిత్ర ఆకులు, పుష్పాలతో పూజించడం ద్వారా.. వాటి సువాసనల నుంచి వెలువడే మిశ్రమ వాయువులను పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కేవలం మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను పూజించి, వాటిని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ఎలాంటి కాలుష్యం కలగకుండా సులువుగా కరిగిపోతాయి.
పట్టించుకోని అధికార యంత్రాంగం
పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాల తయారీని పూర్తిగా నివారించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. అయినప్పటికీ, ప్రభుత్వ కార్యాలయాలకు అతి సమీపంలోనే విగ్రహాల తయారీ యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో క్యారీబ్యాగ్స్ వాడకం నిషేధం ఎలాగైతే నీరుగారిపోయిందో, ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాల నిషేధం కూడా అలాగే మూలన పడే పరిస్థితి కనిపిస్తోంది.
చవితికి పెద్ద ఎత్తున ముస్తాబవుతున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు
మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దాం: కలెక్టర్
భీమవరం (ప్రకాశంచౌక్): వినాయక చవితి వేడుకల్లో మట్టి వినాయక ప్రతిమలతో చేసిన విగ్రహాలనే పూజించాలని, పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. మండపాల్లో, ఇండ్లలోనూ పర్యావరణ హిత వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పూజించాలని కోరారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో మట్టి వినాయక ప్రతిమలను కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి చేతుల మీదుగా ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ, చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు పాల్గొన్నారు.


