రూ.25 లక్షల సొత్తు స్వాధీనం
● చోరీ కేసులను ఛేదించిన పోలీసులు
● రూ.25 లక్షల సొత్తు స్వాధీనం
తాడేపల్లిగూడెం: తేలికగా డబ్బు సంపాదించాలనే అలవాటుకు బానిసైన ఓ యువకుడు, జల్సాలు, ఆన్‌లైన్ జూదాల కోసం తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడ్డాడు. నరసాపురంనకు చెందిన కొత్తపల్లి నరేష్ అనే పాత నేరస్తుడు ఈ చోరీలకు పాల్పడుతూ ఇటీవల పోలీసులకు చిక్కాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తాడేపల్లిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో వెల్లడించారు. నర్సాపురానికి చెందిన కొత్తపల్లి నరేష్‌పై రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 40కి పైగా దొంగతనం కేసులు ఉన్నాయి. గతంలో జైలుకు వెళ్లిన అతను, బెయిల్‌పై ఆగస్టు 1న బయటకు వచ్చాడు. వారం రోజుల పాటు దొంగతనాలు చేయడానికి అనువైన ఇళ్లను రెక్కీ చేశాడు. ఆ తర్వాత తన చేతికి పని చెప్పాడు. తాడేపల్లిగూడెం పట్టణంలో వరుసగా చోరీలకు పాల్పడి, చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
చోరీల పరంపర ఇలా..
ఆగస్టు 1న బెయిల్‌పై బయటకు వచ్చిన నరేష్, 6న పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. 27వ తేదీన పట్టణంలోని రేలంగి సెంటర్ సమీపంలోని టీడీపీ ఆఫీస్ రోడ్డులో ఉన్న మరో ఇంట్లోకి ప్రవేశించి నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ చోరీ చేసిన సొత్తును శేష్‌మహల్ రోడ్డులోని సాయిరాం గోల్డ్ టెస్టింగ్ సెంటర్ వద్ద విక్రయించేందుకు బుధవారం యత్నిస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
నిందితుడు చేసిన రెండు చోరీలకు సంబంధించి సుమారు 19 కాసుల (151.207 గ్రాముల) బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.22 లక్షలు ఉంటుందని అంచనా. వీటితో పాటు కేజీ బరువుకు సమానమైన 967 గ్రాముల వెండి వస్తువులు (సుమారు రూ.3 లక్షల విలువైనవి) దక్కించుకున్నారు. మొత్తం రూ.25 లక్షల విలువైన సొత్తుతో పాటు, చోరీలకు ఉపయోగించిన ఏపీ 39 ఎంబీ 3280 నంబరు గల సుజుకి యాక్సెస్ స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును విజయవంతంగా ఛేదించిన పట్టణ సీఐ బోణం ఆదిప్రసాద్, ఎస్సైలు బాదం శ్రీనివాసు, కె. వెంకటరమణ, సిబ్బంది ఏ. దుర్గాప్రసాద్, పి. శ్రీనివాసరావు, ఆర్‌ఎండీవీ ప్రసాద్, కె. మహేశ్వరరావులను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.


