ద్వారకాతిరుమల: ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం. జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసాని రామారావు, ఆయన భార్య ఈనెల 3న ఇంటికి తాళం వేసి నల్లజర్ల మండలం పోతినీడుపాలెంలోని చిన్నల్లుడి ఇంటికి వెళ్లారు. ఈ నెల 7న ఉదయం 7.30 గంటలకు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపల బీరువాను సైతం ధ్వంసం చేసి అందులోని ఒక జత బంగారు చెవి దిద్దులు, రూ. 50 వేల నగదును అపహరించినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ దర్యాప్తు చేపట్టారు. కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి హేమంత్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 10 గ్రాముల బంగారు చెవి దిద్దులు స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన బైక్‌ను సీజ్ చేశారు. కేసు దర్యాప్తులో హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్, సీహెచ్ లక్ష్మీనారాయణ, ఎన్.శివకృష్ణ పాల్గొన్నారు.
మండవల్లి: రాజస్థాన్ రాష్ట్రంలో తలదాచుకున్న సిగరెట్ బాక్స్‌ల చోరీ కేసు నిందితుడిని మండవల్లి పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. మండలంలోని లోకుమూడిలో గల రత్న ఎంటర్‌ప్రైజెస్ గోడౌన్‌లో సిగరెట్ బాక్సులు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై 2026 జనవరి 6న మండవల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఈ కేసులో ఏ–2 నిందితుడు బుందారాం కుమావత్, ఏ–3 నిందితుడు మనక్ కుమావత్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఏ–1 దినేష్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఎస్పీ కే. ప్రతాప్ శివకుమార్, ఏలూరు ఎస్డీపీఓ డీ. శ్రావణ్‌కుమార్, సీఐ వీ. రవికుమార్ ఆదేశాల మేరకు.. మండవల్లి ఎస్సై రామచంద్రరావు టెక్నికల్ ఆధారాలు, ఇతర సమాచారాన్ని సేకరించారు. నిందితుడి ఆచూకీ రాజస్థాన్‌లో ఉన్నట్లు కనుగొని, అక్కడికి వెళ్లి చాకచక్యంగా బుధవారం అతన్ని అరెస్ట్ చేశారు.
అడ్డుకోబోయి అస్వస్థతకు గురైన రైటర్
భీమవరం: భీమవరం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ ఆవరణలో పి.బ్రహ్మానందరావు అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మానందరావుకు, ఆయన భార్య వాణిశ్రీకి మధ్య కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై మాట్లాడేందుకు ఇద్దరినీ బుధవారం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తుండగా మనస్తాపానికి గురైన బ్రహ్మానందరావు, అప్పటికే జేబులో తెచ్చుకున్న చెదల నివారణ మందును తాగేందుకు యత్నించారు. ఇది గమనించిన స్టేషన్ రైటర్ నాగరాజు వెంటనే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీరిద్దరి పెనుగులాటలో ఆ మందు కొంత స్టేషన్ రైటర్ నాగరాజు నోట్లో కూడా పడింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఇరువురిని హుటాహుటిన సమీపంలోని భీమవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్య చికిత్స అనంతరం స్టేషన్ రైటర్ నాగరాజును ఇంటికి పంపించారు. బ్రహ్మానందరావుకు ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
ద్వారకాతిరుమల: మండలంలోని దేవినేనివారిగూడెంకు చెందిన ఆదూరి సురేష్ (30) ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల 4న పిల్లలకు టిఫిన్ తీసుకుని ఇంటికి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి గ్రామంలోని సీసీ రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘటనలో సురేష్ తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు తొలుత ఏలూరు ప్రభుత్వాస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి 11.30 గంటలకు మృతి చెందాడు. మృతుడి భార్య ఆదూరి సమీర బుధవారం ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఎస్‌కే అమీర్ తెలిపారు.


