ఉచిత న్యాయ సేవలు | - | Sakshi
Sakshi News home page

ఉచిత న్యాయ సేవలు

Aug 20 2026 3:28 AM | Updated on Aug 20 2026 3:28 AM

ఉచిత న్యాయ సేవలు రావికంపాడు హైస్కూల్‌లో విచారణ ఏజెన్సీలో భారీ వర్షం జల్‌ జీవన్‌పై అలసత్వం తగదు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పట్టణ నిరాశ్రయుల గృహంలో ఆశ్రయం పొందుతున్న వారికి అవసరమైతే ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక పత్తేబాదలోని పట్టణ నిరాశ్రయుల గృహాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షెల్టర్‌ హోంలో నిరాశ్రయులకు అందిస్తున్న వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరికి అందించే సౌకర్యాలలో ఎటువంటి రాజీ పడవద్దని, యాజమాన్యానికి సూచించారు. వృద్ధులు సంక్షేమ పథకాలను పొందటంలో ఎదురయ్యే సమస్యలకు న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందని సూచించారు. ఉచిత న్యాయ సలహాలకు 15100 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.

కామవరపుకోట: రావికంపాడు హైస్కూల్‌లో ఇటీవల పదో తరగతిలో చేరిన జంగారెడ్డిగూడేనికి చెందిన కునుసోతు బాల సాయి సుబ్రహ్మణ్యం అనే విద్యార్థి తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఉత్తర్వుల మేరకు డీఈఓ వెంకటలక్ష్మమ్మ బుధవారం విచారణ చేపట్టారు. ఈ సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించిన డీఈఓ పూర్తిస్థాయి విచారణ కోసం త్వరలోనే మరోసారి పాఠశాలకు వస్తానని చెప్పాను. విచారణ సమయంలో ఉపాధ్యాయులకు, విద్యార్థి తల్లిదండ్రులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోగా, మృతుడి సోదరుడు సుబ్రహ్మణ్యం తమకు న్యాయం చేయాలంటూ పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అలాగే విచారణ సమయంలో పాఠశాల గేట్లు వేయటంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయుల విధులకు ఆటంకం కలిగిస్తూ అధికారుల సమక్షంలోనే ప్రధానోపాధ్యాయుడిపై బాలుడు తల్లిదండ్రులు దాడి చేశారంటూ కామవరపుకోట మండలం ఫ్యాఫ్టో నాయకులు ఆరోపించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఉపాధ్యాయులు చెప్పారు.

బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని పలు గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకూ భారీ వర్షం కురిసింది. వర్షంతో గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయంలోకి స్వల్పంగా వరదనీరు చేరినట్లు అధికారులు తెలిపారు. బుట్టాయగూడెంలో 14.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. మండలాల వారీగా పోలవరం 18.6, కుక్కునూరు 29.2, వేలేరుపాడు 28.4, జీలుగుమిల్లి 13.2, టి.నరసాపురం మండలంలో అత్యధికంగా 35 మిల్లీమీటర్ల వర్షం నమోదైనట్లు అధికారులు చెప్పారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో జల్‌ జీవన్‌ మిషన్‌ కింద మంజూరైన పనులను గడువులోపు పూర్తిచేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో జలజీవన్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అంశాలపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో రూ.264.61 కోట్లతో 1,223 పనులు, తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు 603 గ్రామాలకు 306 పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగిరపర్చాలన్నారు. జెడ్పీ సీఈఓ పి.జగదాంబ పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలపై సమీక్ష : జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠాకు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం నుంచి బుధవారం ఆయన కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టర్‌ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 541 పంచాయతీల్లోని 5,664 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement