● గాడి తప్పిన సెక్యూరిటీ విభాగం
● సూపర్‌వైజర్ల ఇష్టారాజ్యం
● సెక్యూరిటీ సిబ్బందిపై దాడితో కలకలం
నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీ (ఆర్జీయూకేటీ)లో పటిష్ట భద్రత కల్పించాల్సిన సెక్యూరిటీ విభాగం తీవ్ర నిర్లక్ష్యానికి, అక్రమాలకు నిలయంగా మారింది. దాదాపు 200 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్న ఈ పూర్తిస్థాయి రెసిడెన్షియల్ క్యాంపస్‌లో, ఇటీవల డ్యూటీ కేటాయింపు వివాదం దాడికి దారితీయడం కలకలం రేపింది.
వివాదం వెనుక అసలు కారణం
ఈనెల 16న మధ్యాహ్నం షిఫ్టులో విధుల్లో ఉన్న లంకపల్లి భూషణం అనే సెక్యూరిటీ గార్డు బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో సూపర్‌వైజర్ ప్రత్తిపాటి నరేష్ తనిఖీకి వచ్చారు. ఆలస్యంగా స్పందించాడనే నెపంతో భూషణంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నరేష్, ఈనెల 18న అతడికి డ్యూటీ కేటాయించలేదు. దీనిపై ప్రశ్నించిన భూషణంతో పాటు అతడి కుమారుడిపై సూపర్‌వైజర్, తన అనుచరులతో కలిసి భౌతిక దాడికి పాల్పడ్డారు. ట్రిపుల్‌ఐటీ ప్రారంభమై 18 ఏళ్లవుతున్నా ఇలాంటి ఘోర ఉదంతం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.
సెక్యూరిటీ విభాగంలో రాజ్యమేలుతున్న అరాచకం
గత కొన్నేళ్లుగా పర్యవేక్షించాల్సిన సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉండటంతో, కొందరు సూపర్‌వైజర్లు స్వేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
పక్షపాతం, అధికార దుర్వినియోగం
డ్యూటీ పాయింట్ల కేటాయింపులో తీవ్ర పక్షపాతం చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ‘మా వెనుక మంత్రి ఉన్నారు’ అని చెప్పుకుంటూ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండి కూడా బయటకు వెళ్లడం, విద్యార్థులు గోడలు దూకి వెళ్తున్నా పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది.
నేరచరిత్ర ఉన్నవారికి పునరావాసం
12 ఏళ్ల క్రితం క్యాంపస్‌లో ల్యాప్‌టాప్‌ల చోరీకి పాల్పడి విధి నిర్వహణ నుంచి తొలగించిన పాత సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
వైఫల్యాలెన్నో..
ప్రతి షిఫ్టునకు 55 మంది సెక్యూరిటీ ఉన్నా, ఏడాది క్రితం సిబ్బంది క్వార్టర్స్‌లో రెండుసార్లు చోరీకి జరిగాయి. ఇప్పటివరకు ఆ దొంగలను పోలీసులు పట్టుకోలేకపోవడం భద్రతా లోపాలను వేలెత్తి చూపుతోంది. పైకి భద్రంగా కనిపిస్తున్నా, లోపల డొల్లగా మారిన ట్రిపుల్‌ఐటీ సెక్యూరిటీ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని, ఆర్జీయూకేటీ చాన్సలర్ వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు.


