బుట్టాయగూడెం: కేఆర్‌పురం ఐటీడీఏలో ఆదివారం జరిగిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని జెడ్పీటీసీ మొడియం రామతులసి తీవ్రంగా ఆరోపించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడుతూ సంవత్సరానికి ఒక్కసారి జరిగే గిరిజన పండుగలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లతోపాటు తనకు ఆహ్వానం రాలేదని ఆరోపించారు. ఈ సంఘటనతో ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌ల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఈ అంశంపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రామతులసిని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తెల్లం రమణ, మాజీ సర్పంచ్‌లు కూరం వెంకటేశ్వరరావు, బన్నే బుచ్చిరాజు, తెల్లం వెంకాయమ్మ, తెల్లం రాముడు, మాల్చి వెంకన్నబాబు, జోడే సత్యదుర్గాప్రసాద్, ఎంపీటీసీ గాలి దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.
మండవల్లి: కొల్లేరు వరద నీటిని, ఉప్పు నీటిని నియంత్రించే రెగ్యులేటర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌ఎస్ భాస్కరరావు పేర్కొన్నారు. ఆదివారం మాట్లాడుతూ కొల్లేరు సరస్సుకు తిరిగి గత వైభవం రావాలన్నా, పక్షుల, మత్స్యకారుల జీవనం సజావుగా సాగాలన్నా, మత్స్య సంపద సమృద్ధిగా పెరగాలన్నా రెగ్యులేటర్ నిర్మాణమే మార్గమని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరు సరస్సుకు భారీగా నీరు చేరుతుందని నీటిని నియంత్రించలేక పోవడంతో ఈ నీరంతా సముద్రంలో వృథాగా పోతుందన్నారు. నీరు ఎగతన్ని కొల్లేరులో కలవడంతో నీరు ఉప్పుమయమై భూములు చౌడుబారుతున్నాయని చెప్పారు.
లింగపాలెం: లింగపాలెం మండలంలో పలు ఇరిగేషన్ చెరువులు ఆక్రమణలతో బక్కచిక్కిపోతున్నాయి. మండలంలో సుమారు 96 ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణలతో చెరువు గర్భాలు కుచించుకుపోవడంతో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. వీటితో చెరువు ఆయకట్టదారుల పంటలకు నీరు చాలక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షాలకే చెరువులు నిండుతున్నాయని దీంతో సాగు నీరు సమృద్దిగా ఉండటంలేదని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు గర్భాల వైశాల్యం తగ్గిపోవటంతో నీరు త్వరితగతిన అయిపోవటంతో పంటలకు సాగు నీటి కొరత ఏర్పడుతుందని రైతులు అంటున్నారు. ఈ చెరువు ఆక్రమణలు కారణంగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు పడి రెండు మూడు సార్లు చెరువులు నిండితే గానీ పంటల సాగుకు నీరు సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ ఆక్రమణలు ఇలాగే కొనసాగితే చెరువు గర్భాల వైశాల్యం పూర్తిగా తగ్గి, సాగుకు నీరు నిల్వ ఉండేపరిస్ధితి ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పలువురు అటవీ భూములను ఆక్రమించుకుని సాగుచేస్తున్నారు. ఆక్రమణలు కొందరు అధికారుల కనుసన్నల్లో సాగడంతో ఈ అక్రమాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. ఈ భూబాగోతాలపై విచారణ జరిపించి అక్రమంగా సాగుచేస్తున్న అటవీ భూములతోపాటు చెరువుల ఆక్రమణదారుల ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.


