నూజివీడు: పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ.80 లక్షలతో నిర్మించిన ఆసుపత్రి భవనం కిటికీల అద్దాలను ధ్వంసం చేస్తే అధికారులు ఎందుకు స్పందించడం లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రశ్నించారు. నూజివీడులో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కిటికీల అద్దాలను ధ్వంసం చేస్తే దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్తులను ఎవరు కాపాడాలో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అద్దాలను పగులగొట్టి ఐదు రోజులైనా ఇంత వరకు మున్సిపల్ అధికారులు గాని, పోలీసులు అధికారులు గాని స్పందించకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు పూర్తయ్యి అందుబాటులోకి వచ్చి రెండేళ్‌లైనా కూటమి పాలకులు అందులో ఆసుపత్రిని ఏర్పాటు చేయకుండా భవనాన్ని వృథాగా ఉంచుతున్నారని ధ్వజమెత్తారు. పట్టణంలోని ప్రజలకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, కోనేరుపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అనేక ప్రైవేటు ఆసుపత్రిలు అందుబాటులో ఉన్నాయని, ఎమ్మార్ అప్పారావు కాలనీలో నివసిస్తున్న దాదాపు 8 వేల మంది పేద ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత పాలకులపై లేదా అని నిలదీశారు. తనకేదో పేరు వస్తుందని పాలకులు సంకుచిత స్వభావంతో ఈ భవనంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం లేదని దుయ్యబట్టారు.
ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నాయకులు
అద్దాలు ధ్వంసం చేసిన ఆసుపత్రి భవనాన్ని వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, నాయకులు మస్తాన్‌వలీ, కాలి సుగుణరావు తదితరులు పరిశీలించారు. లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడం దారుణమన్నారు.


