నూజివీడు: మండలంలోని పాత రావిచర్లలో నిర్వహిస్తున్న కోడిపందేలపై ఆగిరిపల్లి పోలీసులు ఆదివారం సాయంత్రం మెరుపుదాడి చేశారు. గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారంటూ వచ్చిన విశ్వనీసయ సమాచారం మేరకు ఆగిరిపల్లి ఎస్ఐ హెచ్.నాగరాజు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో పందెంగాళ్లు, చూడటానికి వచ్చిన వారందరూ పారిపోగా దాదాపు 13 ద్విచక్ర వాహనాలు, కోడిపుంజును స్వాధీనం చేసుకున్నారు. పాత రావిచర్లలో ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. ఆదివారం వస్తే మాత్రం గ్రామంలో అంకమ్మ తల్లి గుడి ఎదురుగా పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఈ పందేలలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. దీనిలో భాగంగా నూజివీడు మండలం రామన్నగూడెం, కృష్ణాజిల్లాలోని ఉంగుటూరు మండలం పొట్టిపాడు, కోడూరుపాడు, హనుమాన్‌జంక్షన్, విజయవాడ సమీపంలోని నున్న తదితర గ్రామాల నుంచి కూడా కోడిపందేలకు తరలివచ్చారు. కోడిపందేలు జరుగుతుండగా పందెగాళ్ల మధ్య గొడవ జరగడంతో సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు దాడి జరిపారు.


