ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): భారతీయ సంస్కృతిలో భాగమైన చేనేత కళను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ కళను పరిరక్షించేందుకు చేనేత వస్త్రాలను ధరించాలని కలెక్టర్ కే. వెట్రిసెల్వి సూచించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి, చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తున్నారన్నారు. నేతన్న సేవ పథకంలో అర్హులైన ప్రతి చేనేత కార్మికులకు రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, అంతేకాక చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తుందన్నారు. చేనేత సహకార సంఘాలకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎం.శ్రీదేవి, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి కే.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


