ఎంటీఎస్‌ అమలులో తీవ్ర జాప్యం | - | Sakshi
Sakshi News home page

ఎంటీఎస్‌ అమలులో తీవ్ర జాప్యం

Aug 8 2026 12:53 AM | Updated on Aug 8 2026 12:53 AM

ఎంటీఎస్‌ అమలులో తీవ్ర జాప్యం

కీలక అధికారి ఉచిత సలహాతో..

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని వైనం

ఆర్జీయూకేటీ అధికారుల నిర్లక్ష్యం

నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఫ్యాకల్టీ, సిబ్బందికి మినిమం టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కోర్టు తీర్పుల మేరకు ప్రభుత్వం జీఓలు జారీ చేసి ఆర్థిక అనుమతులు మంజూరు చేసి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ఎంటీఎస్‌ అమలుకు నోచుకోకపోవడంపై నాలుగు ట్రిపుల్‌ఐటీల్లోని బోధనా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా యూనివర్సిటీ అధికారుల వ్యవహారంపై తీవ్ర విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి.

హైకోర్టు ఆదేశాలున్నా విశ్వవిద్యాలయం వాటిని అమలు చేయకపోవడం పట్ల డొమైన్‌ మెంటార్లు, ఐటీ మెంటార్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, నాన్‌–టీచింగ్‌ సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వం ఆర్థిక అనుమతి ఇస్తే వెంటనే ఎంటీఎస్‌ అమలు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. తీరా ప్రభుత్వం వరుసగా జీఓలు జారీ చేసి ఆర్థిక అనుమతులు మంజూరు చేసిన తర్వాత, ఇప్పుడు అమలు చేయకుండా ఉండటానికి ఏవో సాకులు వెతికే పనిలో పడ్డారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం జీఓలు విడుదల చేసినా యూనివర్సిటీ ఎంటీఎస్‌ను అమలు చేయకపోతే న్యాయం కోసం ఇంకెవరి దగ్గరకు వెళ్లాలని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాకల్టీ, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌కు అమలు చేయాలి

నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో కలిపి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 63 మంది మెంటార్లు, 64 మంది ఐటీ మెంటార్లు, 126 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 29 మంది బోధనేతర సిబ్బందితో కలిపి మొత్తం 282 మంది ఉద్యోగులకు హైకోర్టు ఆదేశాల మేరకు ఎంటీఎస్‌ అమలుకు ప్రభుత్వం జీఓ నంబర్లు 78, 106, 124, 128, 143ను జారీ చేసింది. వీటిల్లో జీఓ నంబర్లు 78, 128లు ఐటీ మెంటార్లకు, జీఓ నంబర్లు 106, 124లు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు, జీఓ నంబరు 143 మెంటార్స్‌తో పాటు 29 మంది బోధనేతర సిబ్బందికి సంబంధించినవి.

44 మంది ఐటీ మెంటార్లకు సంబంధించి మే 12న జీఓ వచ్చినా ఇప్పటికీ దానిని అమలు చేయలేదు. జీఓలు వచ్చి రెండు నుంచి మూడు నెలలు గడుస్తున్నా ఆర్జీయూకేటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

కోర్టును ఆశ్రయించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

ఫ్యాకల్టీ అందరూ కోర్టుకు వెళ్లి ఎంటీఎస్‌ అమలు చేయాలని ఉత్తర్వులు తెచ్చుకోవడంతో, 2010లో నియమితులైన దాదాపు 53 మంది కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తమకూ అమలు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కొన్నాళ్లుగా ఆర్జీయూకేటీ ఉద్యోగులందరూ కోర్టు మెట్లు ఎక్కుతున్న నేపథ్యంలో ఇక్కడ పరిపాలన ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది.

నూజివీడులోని ట్రిపుల్‌ఐటీ

ఎంటీఎస్‌ అమలు చేయాలని ఫ్యాకల్టీ ఎప్పటి నుంచో ఆర్జీయూకేటీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. యూనివర్సిటీలో ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి ఒకరు కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోండి.. అమలు చేస్తాం అంటూ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఫ్యాకల్టీ అందరూ ఒక కేడర్‌ తర్వాత మరొకరు వరుసగా కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెస్తుండటం, ప్రభుత్వం కూడా వరుసగా జీఓలు ఇవ్వడంతో ఇప్పుడు ఎంటీఎస్‌ను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావడంతో ఆ అధికారి గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో పాలుపోక ఆర్జీయూకేటీ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వం జీఓలు జారీ చేసిన నేపథ్యంలో, జీఓ ఇచ్చిన నాటి నుంచే ఎంటీఎస్‌ అమలు చేయాల్సిందేనని ఫ్యాకల్టీ స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement