కై కలూరు: ఆడి కృత్తిక సందర్భంగా శింగరాయపాలెం సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన కావడి సేవ ప్రజల్లో భక్తి భావాన్ని నింపింది. కావడి ఉత్సవాన్ని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించి, భక్తులతో కావడి మోసి స్వామికి పూజలు చేశారు. తమిళనాడు రాష్ట్రం పళని మురగన్ క్షేత్రంలో నిర్వహించే కావడి సేవను గతేడాది నుంచి శింగరాయపాలెం దేవాలయంలో ప్రవేశపెట్టారు. కావడి సేవలో పసుపు వస్త్రాలు ధరించి 340 మంది భక్తులు పాల్గొన్నారు. శింగరాయపాలెం, చేవూరుపాలెం, శ్రీహరిపురం గ్రామాల్లో కావడి ప్రదర్శనలు చేసి అనంతరం స్వామికి సమర్పించారు. ఉదయం స్వామికి విఘ్నేశ్వర, గోపూజలు నిర్వహించారు. గ్రామోత్సవం అనంతరం స్వామికి శాంతి కల్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా చేపట్టారు. దేవస్థానం వద్ద 3,000 మందికి భారీ అన్నసమారాధన జరిగింది. కేరళ చండా మేళం, భారీ ఆకారంలో ఆంజనేయ బొమ్మలు ఆకట్టుకున్నాయి. ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్, ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి, ఆలయ ధర్మకర్తలు విమల, శ్రీనాగలలిత, శివరమేష్, కృష్ణ, సోవమ్మ, సుబ్బలక్ష్మీ, నాగలక్ష్మి, నాగ వెంకట రాధాకృష్ణ, నాగ శిరిష, నాగకొండ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నాయకులు పరసా విశ్వేశ్వరరావు, బొర్రా చలమయ్య, చల్లగుళ్ళ శోభనాద్రిచౌదరీ, కోడూరు శేషుబాబు, ఈడ్పూగంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆడి కృత్తిక కావడి సేవ


