కాళ్ల : కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులకు భక్తులు విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు శుక్రవారం తెలిపారు. కలవపూడికి చెందిన నల్లపురాజు చిన్నకృష్ణంరాజు, అచ్యుతాయమ్మ దంపతుల కుమారుడు నీలాద్రిరాజు, సౌజన్యలక్ష్మి దంపతులు దక్షిణం వైపు కేశఖండన శాల పక్కన భవనం నిర్మాణానికి రూ.5,01,116 అందించారన్నారు.
నూజివీడు: లారీకి బ్రేకులు ఫెయిల్ అయిన నేపథ్యంలో ట్రిపుల్‌ఐటీలో శుక్రవారం పెనుప్రమాదం తప్పింది. మెస్‌లకు బియ్యం లోడుతో ఉదయం 6.30 గంటల సమయంలో క్యాంపస్‌లోకి వచ్చిన లారీకి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో లారీ ఐ–3 భవనానికి, మెస్‌కు మధ్య ఉన్న రోడ్డులో ఐ–2, ఐ–1 భవనాల మధ్య వెళ్లి ప్రహరీగోడను ఢీకొట్టి ఆగింది. లారీ ఢీకొట్టడంతో గోడ పడిపోయింది. ఇదే సంఘటన విద్యార్థులు వెళ్లే సమయంలో జరిగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
భీమవరం: భీమవరం పట్టణంలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల న్యాయ సేవా సంస్ధ చైర్మన్, 3వ అదనపు జిల్లా జడ్జి బి.లక్ష్మీనారాయణ చెప్పారు. పట్టణంలోని అన్ని కోర్టుల ప్రాంగణంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో వున్న అన్ని సివిల్ కేసులు, ఐపీసీ, బీఎన్‌ఎస్ చట్టాల పరిధిలో ఉన్న రాజీ కాదగ్గ క్రిమినల్ కేసులు, చెక్కు, ప్రోనోటు బాకీ కేసులు, మనోవర్తి, గృహహింస కేసులు, భార్యభర్తల మధ్య గొడవల కేసులు, సరిహద్దు తగాదాలు వంటి కేసులు రాజీ చేసుకునే అవకాశం ఉందన్నారు. రాజీ పడితే ఇరుపక్షాలు గెలిచినట్లేనన్నారు. జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకుని కేసులను రాజీ చేసుకోవాలని లక్ష్మీనారాయణ కోరారు.
భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలిక కనిపించడం లేదంటూ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రహ్మన్ శుక్రవారం చెప్పారు. పట్టణంలోని శ్రీరామపురం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక గురువారం రాత్రి తల్లితో కలిసి ఇంట్లో నిద్రపోయింది. శుక్రవారం ఉదయం బాలిక కనిపించకపోవడంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
భీమడోలు : భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం పట్టాలు దాటుతున్న ఓ గుర్తుతెలియని వృద్ధుడిని రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. ఆకివీడు నుంచి నిడదవోలు వచ్చి, అక్కడ నుంచి భీమడోలు వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 60 ఏళ్లు ఉంటుందని.. షర్టుపై టైలర్ అని రాసి ఉందని చెబుతున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే ఎస్‌ఐ కృపాదానం తెలిపారు. ఆచూకీ తెలిస్తే 944041100 నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
చింతలపూడి: జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కె.వి.నాగ ప్రభు కుమార్ శుక్రవారం చింతలపూడి ఎకై ్సజ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులు, కేసు ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఎకై ్సజ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, విధి నిర్వహణపై పలు కీలక సూచనలు జారీ చేశారు. సర్కిల్ పరిధిలో నాటుసారా తయారీ, విక్రయాలు, అక్రమ మద్యం రవాణా, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఐ పి. అశోక్, ఎస్‌ఐ జె. జగ్గారావు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


