బుట్టాయగూడెం: మండలంలోని పండుగూడెంలో లేగదూడపై పెద్దపులి శుక్రవారం దాడి చేసి హతమార్చింది. దీంతో మరింత అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాష్ట్ర, పూనె నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందాలు రంగంలోకి దిగాయి. సీసీఎఫ్ ఆశాజ్యోతి, డీఎఫ్‌ఓ సందీప్‌రెడ్డి తదితరులు కండ్రికగూడెం సమీపంలో పులి సంచారాన్ని గుర్తించి, దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతం కొండలు, గుట్టలతో కూడి ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో పులిని పట్టుకోవడం సవాలుగా మారిందని డీఎఫ్‌ఓ తెలిపారు. అయితే పులి మైదాన ప్రాంతంలోకి రాగానే మత్తుమందు (రసాయన పద్ధతి) ఇచ్చి సురక్షితంగా పట్టుకోవడానికి ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు, పాపికొండల నేషనల్ పార్క్ బృందాలు సిద్ధంగా ఉన్నా యని చెప్పారు. మైక్ ప్రచారం, డప్పు చాటింపుల ద్వారా పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కన్నాపురం, పోలవరం, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం రేంజ్ అధికారులతో పాటు ఏపీ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆదేశాల మేరకు సిబ్బంది నిరంతరం పులి సంచారాన్ని ట్రాక్ చేస్తున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో శనివారం (1వ తేదీన) 2,54,579 మంది పింఛన్‌దారులకు రూ.112.43 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఉదయం 7 ంటల నుంచి పంపిణీ ప్రారంభిస్తామన్నారు.
పోలవరం రూరల్: పోలవరంలో గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం నుంచి దిగువకు 12.52 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతుంది. దిగువన పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.900 మీటర్ల ఎత్తు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 6.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరు తుంది. దిగువన ఇసుక దిన్నెలు ముంచుకుంటూ ఉభయగోదావరి జిల్లాల మధ్య లంక ఒడ్డున తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది.
వేలేరుపాడు: గోదావరి వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను, గర్భిణులు, వృద్ధులు, విభిన్న ప్రతి భావంతులను ప్రాధాన్యతపై పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. 12 బోట్లు, గజఈతగాళ్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, 12 భారీ జనరేటర్లు, 750 టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలన్నారు. పాముకాటు విరుగుడు బిళ్లలతో సహా అవసరమైన మందులతో వైద్య శిబిరాలు, పాఠశాలలకు 1,000 లీటర్ల తాగునీటి ట్యాంకులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక అధికారిని నియమించి, 24/7 కంట్రోల్ రూమ్‌లను నిర్వహించాలని ఆదేశించారు. నదిలోకి ఈతకు, చేపల వేటకు వెళ్లకుండా టామ్ టామ్ ద్వారా ప్రచారం చేయాలని, మూగజీవాలకు దాణా సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జేసీ అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్ రెడ్డి, జెడ్పీ సీఈఓ పి.జగదాంబ, ఆర్డీఓ ఎంవీ రమణ, ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, డీపీఓ వీకే మల్లికార్జునరావు, డీఎంహెచ్‌ఓ శోభ, డీసీహెచ్‌ఎస్ బేబీ కమల, విద్యుత్ ఎస్ అంబేడ్కర్, వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా, డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.


