కై కలూరు: ఆమె ఇకలేరని డాక్టర్లు నిర్ధారించారు. అంబులెన్సులో ఇంటికి చేర్చేలోపే అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. శ్రద్ధాంజలి బ్యానర్ కట్టారు. ఆమె మాజీ మహిళా సర్పంచ్. కై కలూరు మండలం భుజబలపట్నం గ్రామం. పేరు గురజాల రామతులసి. 48 ఏళ్లు. భర్త, ఇద్దరు మగ సంతానం. కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యా దితో బాధపడుతున్నారు. ఏలూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గత సోమవారం ఆమెను చికిత్స నిమిత్తం చేర్పించారు. గురువారం ఉదయం పల్స్ లేదని, మెదడుపై ప్రభావం చూపడంతో ప్రాణం పోయిందని వైద్యులు చెప్పడంతో అంబులెన్సులో ఆమెను ఇంటికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో కదలిక కనిపించింది. దీంతో తిరిగి ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్నారని జాయిన్ చేసుకోలేదు. చివరకు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. గురువారం రాత్రికి ఆమె పల్స్ 70కి చేరింది. ఇంజక్షన్ చేస్తే ఆమె శరీరం బాధతో కంపించింది. నిలిచిపోయిన యూరిన్ సమస్య తగ్గింది. ఇప్పుడామె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
ఫ్రీజర్.. పాడె సిద్ధం
భార్య ఇకలేరని కడసారి ఏర్పాట్లు సిద్ధం చేయడానికి భర్త వేణు స్వగ్రామం భుజబలపట్నం ముందుగానే చేరుకున్నారు. కర్మకాండలకు పాడె సామగ్రి, మృతదేహాన్ని ఉంచడానికి ఫ్రీజర్, పూలు సిద్దం చేశారు. ఇంటి వద్ద ఆమె ఫొటోతో శ్రద్ధాంజలి బ్యానర్ కట్టారు. ఇక సోషల్ మీడియా వా ట్సాప్‌లలో శ్రద్ధాంజలి ఘటిస్తూ పలువురు పోస్టులు పెట్టారు. రామతులసి వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ సర్పంచ్ కావడంతో ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ కై కలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)తో పాటు గ్రామ పెద్దలు మృతదేహానికి నివాళి అర్పించడానికి భుజబలపట్నం వచ్చారు. ఇంతలో ఆమెలో కదలిక వచ్చిందని చెప్పడంతో డీఎన్నార్ విజయవాడ ప్రభుత్వాసుపత్రి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
నా భార్య బతికింది
చనిపోయిందని భావించిన తన భార్య బతకడం ఎంతో సంతోషనిచ్చిందని భర్త వేణు మాటలకందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ ఆస్ప త్రిలో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఇది మరో జన్మగా భావిస్తున్నామన్నారు. భుజబలపట్నంలోని ఆయన కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.
పల్స్ పడిపోయి మృతి చెందిందని నిర్ధారించిన డాక్టర్లు
ఇంటికి తీసుకొస్తుండగా అంబులెన్సులో కదలికలు
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 70కి చేరిన మహిళ పల్స్
మాజీ మహిళా సర్పంచ్ ఇంట వెల్లివిరిసిన సంతోషం


