జోరుగా పాత బట్టల వ్యాపారం | - | Sakshi
Sakshi News home page

జోరుగా పాత బట్టల వ్యాపారం

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

జోరుగా పాత బట్టల వ్యాపారం

పండుగ రోజుల్లో..

20 ఏళ్లుగా జీవనాధారం

కార్మికులే కొనుగోలు చేస్తారు

లాభాల కోసం చూడం

భీమవరం : విద్య, వ్యాపార, వైద్య కేంద్రాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో ఒకవైపు భారీ షాపింగ్‌ మాల్స్‌ వెలుస్తుంటే... మరోవైపు పేదల కోసం పాత బట్టలు అమ్మే దుకాణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆక్వా హబ్‌గా పేరుగాంచి, ప్రభుత్వానికి కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నప్పటికీ, భీమవరం పరిసర ప్రాంతాల్లో అనేక మంది పేదలు పూట గడవడానికి పడుతున్న పాట్లు వర్ణనాతీతం. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి పేరుతో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నా, ఒంటి నిండా బట్ట కప్పుకోవడానికి అనేక మంది పేదలు పాత బట్టల వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. పాత బట్టలను విక్రయిస్తూ పట్టణంలో అనేక కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.

అంతా డబ్బున్నవారే అనుకుంటే పొరపాటే...

పట్టణ పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా ధనవంతులేనని, ఇక్కడ భారీ ఎత్తున వ్యాపారాలు సాగుతున్నాయనే ప్రచారం ఉంది. ఆక్వా చెరువుల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందన్నది నిజమే అయినా, ఽపేదలు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో నాణ్యమైన కొత్త దుస్తులు కొనలేని పేదలు ఎక్కువగా ఉండటంతో, పట్టణంలో పాత బట్టల వ్యాపారం జోరుగా సాగుతోంది.

బస్టాండ్‌ వెనుక జోరుగా విక్రయాలు...

పట్టణంలోని బస్టాండ్‌ వెనుక ఉన్న సాయిబాబా గుడి ప్రాంతంలో చాలాకాలంగా పాత బట్టల వ్యాపారం సాగుతోంది. వీటితో పాటు ఇండస్ట్రియల్‌ ఏరియా, లారీ స్టాండ్ల వద్ద చిరిగిన వస్త్రాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ వ్యాపారంలో ఎక్కువగా మహిళలే ఉండటం విశేషం. వీరికి కొందరు పురుషులు గ్రామాల్లో తిరిగి పాత బట్టలు సేకరించి తెచ్చి ఇస్తుంటారు. ఇక్కడ చీరలు, ప్యాంట్లు, షర్టులు, లుంగీలు, నైటీలు, చిన్నపిల్లల దుస్తులు ఇలా అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయి. పట్టణంలో మంగళ, శుక్రవారాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ ఈ వ్యాపారం జరుగుతుంది. మంగళ, శుక్రవారాల్లో పాత దుస్తులు కొనకూడదనే సెంటిమెంట్‌ ఉండటంతో కొనుగోలుదారులు రారని వ్యాపారులు చెబుతున్నారు. కాగా, భీమవరంలో పాత బట్టల వ్యాపారం నెలకు సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని అంచనా.

పాత బట్టలు కొనుగోలుచేసేవారు ఎక్కువగానే ఉంటారు, ప్రధానంగా పండుగ రోజుల్లో వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. కొత్త బట్టలు కొనుగోలు చేయలేని పేదలు కనీసం శుభ్రమైన చిరుగులు లేని వస్త్రాలు ధరించాలనే పాత బట్టలు కొంటుంటారు.

– చింతా జ్యోతి, వ్యాపారి

దాదాపు 20 ఏళ్లుగా పాతబట్టల వ్యాపారంతోనే జీవనం సాగిస్తున్నాం. కొత్త బట్టల షాపులెన్ని వచ్చినా మా వ్యాపారం మాత్రం కొనసాగుతూనే ఉంది. కార్మికులు, పేదలు పాత బట్టలు కొనుగోలు చేస్తుంటారు.

– కానేటి ధనలక్ష్మి, వ్యాపారి

పాత బట్టలను ఎక్కువగా కార్మికులు కొనుగోలు చేస్తుంటారు. ప్రతి రోజు తాపీపనులు, బంటా పనులకు వెళ్లే పేద కార్మికులు పాత బట్టలు కొనుగోలు చేస్తారు. చిరుగులు లేని చీరలు, ఫ్యాంటు, షర్ట్స్‌ తక్కువ ధరలకు లభించడంతో కార్మికులు వాటిని వినియోగిస్తారు.

– గంటా పుష్పలత, వ్యాపారి

కొత్తబట్టలు కొనుగోలు చేయలేని పేదలు చిరుగులు లేని, శుభ్రమైన పాతబట్టలే కొత్తవిగా భావిస్తారు. మావద్దకు వచ్చే వారంతా పేదలు కావడంతో మేము కూడా పెద్ద మొత్తంలో లాభాల కోసం చూడకుండా తక్కువ ధరలకే విక్రయిస్తుంటాం.

– గంటా ఇందిర, వాప్యారి

భీమవరం బస్టాండ్‌ వెనుక పాత బట్టల దుకాణాలు

20 ఏళ్లకు పైగా విక్రయాలు

నెలకు సుమారు రూ.50 లక్షల వ్యాపారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement