విద్యాసంస్థల బంద్‌ జయప్రదం | - | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థల బంద్‌ జయప్రదం

Jul 25 2026 1:11 AM | Updated on Jul 25 2026 1:11 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ శుక్రవారం జిల్లాలో జయప్రదమైంది. ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలు ముందు రోజునే తమ సంస్థలకు సెలవు ప్రకటించి బందులో పాల్గొన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్‌ మీటింగ్‌ (పీటీఎం) ఏర్పాటు చేయడంతో వాటికి బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. జూనియర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, పాలిటెక్నిక్‌ కాలేజీలను ఆయా విద్యార్థి సంఘాల నాయకులు మూయించి వేశారు. ఏలూరులో కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీ వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకు నేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు పి.శివాజీ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్‌, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకుడు గేదెల శివకుమార్‌ కేంద్ర ప్రభుత్వ తీరుపై శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై ఢిల్లీలో పోలీసులు అమానుష లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పీవీ రామకృష్ణ, సీఐటీయూ జిల్లా నాయకులు పంపన రవికుమార్‌, మంచెల్ల ఇస్సాక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement