ఆశలన్నీ పొగాకు ధరపైనే.. | - | Sakshi
Sakshi News home page

ఆశలన్నీ పొగాకు ధరపైనే..

Mar 20 2026 8:19 AM | Updated on Mar 20 2026 8:19 AM

25 నుంచి కొనుగోళ్లు ప్రారంభం

అవశేషాలు ఉండకూడదు

గిట్టుబాటు ధరపైనే ఆశలు

బుట్టాయగూడెం: ఏజెన్సీ, మెట్టప్రాంతంలో వర్జీనియా పొగాకు పంట ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో రెల్పులు, క్యూరింగ్‌, గ్రేడింగ్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. దీంతో పంటకు గిట్టుబాటు ధర కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సీజన్‌లో రైతులు పొగాకు పంట సాగును వాతావరణ పరిస్థితుల దృశ్ట్యా ఆలస్యంగానే ప్రారంభించారు. సీజన్‌ ప్రారంభంలో వేసిన పంటలు బాగున్నప్పటికీ ఆలస్యంగా వేసిన పంటల్లో కొంతమేర తెగుళ్లు రైతులను ఇబ్బంది పెట్టాయి. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో రైతులు తెగుళ్ల బారి నుంచి బయటపడ్డారు. పంట రంగులు, నాణ్యత, దిగుబడి బాగున్నాయి. 99 శాతం బ్రైట్‌ పొగాకు వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

26,887 హెక్టార్లలో సాగు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో 2025–26 సంవత్సరానికి గానూ సుమారు 26,887 హెక్టార్లలో రైతులు పొగాకు పంట వేసినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. అలాగే 11,885 మంది రైతులు 13,401 బేరన్‌లను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు చెప్పారు. బేరన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రకారం 20,987 హెక్టార్లలో పంట సాగు చేయాల్సి ఉండగా రైతులు అదనంగా 6 వేల హెక్టార్లకు పైగా పంట వేశారు. 2025–26 పంట కాలానికి సంబంధించి 45.81 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతులు ఇవ్వగా రైతులు లక్ష్యానికి మించి సాగు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ముమ్మరంగా క్యూరింగ్‌ పనులు

ఆశాజనకంగా వర్జీనియా పొగాకు సాగు

బాగున్న పంట రంగు, దిగుబడులు

గత రెండు రోజులుగా మబ్బులు భయపెట్టినా అనుకూల వాతావరణ పరిస్థితులే అంటున్న రైతులు

25 నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభం

గిట్టుబాటు ధరపైనే రైతుల ఆశలు

ఈ నెల 25వ తేదీ నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న 5 వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక పొగాకు మార్కెట్‌ నిలకడగా సాగుతుంది. అక్కడ కొన్ని ఒడిదుడుకులు నెలకొనడంతో ఈ పరిస్థితులను జిల్లాలోని రైతులు నిశితంగా పరిశీలిస్తూ పంటసాగు ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నారు. గతేడాది మార్కెట్‌ ముగిసే సమయానికి ఎన్‌ఎల్‌ఎస్‌లోని 5 వేలం కేంద్రాల పరిధిలో 58.25 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోళ్లు చేసినట్లు అధికారులు చెప్పారు. అలాగే అమ్మకాలు ముగిసే సమయానికి కిలో పొగాకు ధర రికార్డు స్థాయిలో రూ.418 ధర పలికింది. దీంతో ఈ ఏడాది ధరపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.

పొగాకులో రసాయనిక పురుగు మందులు ఉండకూడదు. యురోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు పెరిగాయి. అవశేషాలు ఉన్న పొగాకు కొనుగోలుకు ట్రేడర్‌లు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. రైతులు నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేసి గిట్టుబాటు ధర పొందాలి.

– బి.శ్రీహరి, ధరల నిర్వహణ అధికారి, గోపాలపురం

ఈ ఏడాది పొగాకు పంటకు గిట్టుబాటు ధర వస్తుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం పంట రంగు, నాణ్యత, దిగుబడి బాగా ఉన్నాయి. గ్రేడింగ్‌లో, క్యూరింగ్‌లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ నెల 25 నుంచి కొనుగోలు ప్రారంభమవుతున్నందున గిట్టుబాటు ధర వస్తుందని ఆశిస్తున్నాం.

– ఎన్‌ఎస్‌వీ వెంకట్రావు, పొగాకు రైతు, కండ్రికగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement