సడి లేని గిజిగాడు | - | Sakshi
Sakshi News home page

సడి లేని గిజిగాడు

Mar 20 2026 8:08 AM | Updated on Mar 20 2026 8:08 AM

ఆలయాల్లో వరి కుచ్చులు

జీవవైవిధ్యం కాపాడుకోవాలి

గ్రామాల్లో కనుమరుగవుతున్న పిచ్చుకలు

చిన్న పొట్టకు తిండి, గూడు కరువు

నేడు పిచ్చుకల సంరక్షణ దినోత్సవం

ద్వారకాతిరుమల : కిచ్‌ కిచ్‌..కిచ్‌ కిచ్‌ అనే శబ్దాలతో ఒకప్పుడు పల్లెలు, పట్టణాల్లో సందడి చేసే పిచ్చుకలు నేడు కనుమరుగయ్యాయి. చిన్నతనంలో పాఠ్యపుస్తకాల్లో గిజిగాడు పాఠ్యాంశం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అలాంటి గిజిగాడికి ప్రస్తుత కాంక్రీట్‌ కీకారణ్యంలో గూడు కరువైంది. పట్టణాల్లో పచ్చదనం కరువై, నీడ కరువవడంతో పాటు, సెల్‌ టవర్ల రేడియేషన్‌ కూడా పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణంగా చెబుతున్నారు. జీవ వైవిధ్యం కాపాడుకునే దిశలో పర్యావరణ ప్రేమికులు పిచ్చుకల సంరక్షణకు కృషి చేస్తున్నారు. ఒకప్పుడు మనిషికి పిచ్చుక కూడా నేస్తమే. పిచ్చుకతో మనిషికి ఉన్న సంబంధం కొన్ని శతాబ్దాల కాలం నాటిది. మానవుడు వ్యవసాయం ప్రారంభించిన తొలి రోజుల్లో తమకు ఉపకరించే వశు పక్ష్యాదులపై శ్రద్ధ వహించేవారు. ప్రధానంగా మన ఇంటి పిచ్చుకగా పిలిచే ఈ పక్షి తాటాకు ఇళ్ల చూరుల్లో గూళ్ళు పెట్టుకొని తమ సంతతిని వృద్ధి చేసుకునేవి. అదే సమయంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారంతా తమ ఇళ్ల చూరుకు ధాన్యం కుంకుల గుత్తులు వేలాడదీసేవారు. దీంతో పిచ్చుకలు ఆహారం తీసుకొని ఆ ఇంటి చుట్టుపక్కల కిచుకిచుమంటూ తిరుగుతుండేవి. పిచ్చుకలు పంటలను ఆశించే క్రిమికీటకాలను తినడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. నేడు పొలాల్లో చల్లే రసాయన క్రిమిసంహారక మందులు పిచ్చుకలకు తిండిని దూరం చేశాయి.

సెల్‌ టవర్లే ప్రధాన కారణం

ఆధునికీకరణలో భాగంగా పచ్చని రావి, మర్రి చెట్లను ఎక్కడికక్కడ నిర్ధాక్షణ్యంగా తొలగించేశారు. పోనీ మానవుడు నిర్మిస్తున్న పెద్దపెద్ద భవనాల్లో కాస్తంత చోటు కూడా పక్షులకు లేకుండా పోయింది. వాటి గూడుకు కనీసం చెట్లు కూడా లేవు. చిన్ని పొట్టకు ఇంత తిండి కూడా దొరకని పరిస్థితి ఉంది. వాస్తవానికి పిచ్చుకల్లో అనేక జాతులు ఉండేవి. పిచ్చుక జాతి అంతరించి పోవడానికి రేడియోధార్మికత విడుదల చేసే సెల్‌ఫోన్‌ టవర్లే ప్రధాన కారణంగా పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల పిచ్చుకలలో సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది. పిచ్చుకలు సాధారణంగా చెట్లు, పూరిపాకల పైకప్పు కింద గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి కనుమరుగు అయిపోవడంతో వీటికి ఆవాసం కరువైంది.

ప్రముఖ పుణ్య క్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలోను, అలాగే క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ ఆలయంలో పిచ్చుకలకు ఆహారం అందించేందుకు వరి కుచ్చులను ఏర్పాటు చేశారు. కొందరు భక్తులు, రైతులు వీటిని స్వచ్ఛందంగా తీసుకొచ్చి చెట్లకు ఏర్పాటు చేస్తున్నారు. పిచ్చుకలు వచ్చి వీటిని తింటున్నాయి. అలాగే దేవస్థానం సిబ్బంది వాటికి మంచినీటిని అందిస్తున్నారు. పిచ్చుకల సంరక్షణకు దేవాలయాలు పెద్దపీట వేస్తున్నాయి.

కొన్ని పక్షి జాతులు అంతరించిపోతే జీవ వైవిధ్యం సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మానవుడి ఆధునిక జీవన శైలి వల్ల, సౌండ్‌, ఎయిర్‌ పొల్యూషన్‌, సెల్‌ టవర్స్‌ వల్ల పిచ్చుకలు కనుమరుగైపోయాయి. మానవ మనుగడకు పిచ్చుకల సంతతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మా ఇంటి వద్ద పిచ్చుక గూళ్లు, ధాన్యం కుచ్చులను ఏర్పాటు చేశాను.

– పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు, మాజీ సర్పంచ్‌, రామన్నగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement