ఆగిరిపల్లి: మండలంలోని కనసానపల్లి లో గ్రావెల్ తవ్వకాలకు ప్రభుత్వం వద్ద నుంచి అనుమతులు తీసుకుని అనుమతికి మించి అధిక లోతు తవ్వేరని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినందుకు గ్రావెల్ క్వారీ నిర్వాహకులు తనను బెదిరిస్తున్నారని గ్రామానికి చెందిన ఆలూరు రామ్‌మోహన్ రావు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు రామ్‌మోహన్‌రావు గురువారం విలేకరులతో మాట్లాడుతూ కనసానపల్లి గ్రామంలో ఓ సంస్థ కు చెందినవారు సర్వేనెంబర్ 1606, 1608లో మూడు నెలల క్రితం రెండు ఎకరాలలో గ్రావెల్ తవ్వుకునేందుకు మైనింగ్ శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకుని అనుమతులు కు మించి సుమారు 40అడుగుల లోతు తవ్వేయడంతో రామ్మోహన్‌రావు ఈ నెల 2న పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు, మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు మైనింగ్ శాఖ అధికారులు వచ్చి తూతూ మంత్రంగా కొలతలు తీసుకుని వెళ్లిపోయారని ఆరోపించాడు. అయినా సరే గ్రావెల్ తవ్వకాలు ఆపకపోవడంతో గురువారం గ్రావెల్ తవ్వకాలు జరిగే ప్రదేశానికి వెళ్లి మీరు అనుమతులు లేకుండా అంత లోతు ఎందుకు తవ్వారని వారిని ప్రశ్నించగా, సిబ్బంది గ్రావెల్ నిర్వాహకులైన అబ్బాయికి ఫోన్ చేయగా నువ్వు రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నావని పోలీసులకు, మంత్రికి ఫిర్యాదు చేసి జైల్లో పెట్టిస్తానని బెదిరించాడని రామ్మోహన్ రావు వాపోయాడు. గ్రావెల్ నిర్వాహకులు నుంచి తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.


