● ప్రతికూల వాతావరణం కారణంగా.. నిత్య కల్యాణ మండపంలో వేడుక
● ఘనంగా పంచాంగ శ్రవణం, పండిత సత్కారాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఉగాది ఉత్సవం గురువారం రాత్రి కన్నులపండువగా జరిగింది. స్థానిక ఉగాది మండపంలో జరగాల్సిన ఈ వేడుక ప్రతికూల వాతావరణం కారణంగా స్వామివారి నిత్య కల్యాణ మండపంలో జరిగింది. అర్చకులు, పండితులు వైభవోపేతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయం నుంచి నిత్య కల్యాణ మండపం వద్దకు తొళక్క వాహనంపై అట్టహాసంగా తరలివచ్చారు.
వేడుక జరిగింది ఇలా.. ఉభయ దేవేరులతో శ్రీవారు కొలువైన తొళక్క వాహనం నిత్యకల్యాణ మండపం వద్దకు వచ్చే సరికి అక్కడున్న భక్తులు స్వామి వారికి భక్తిప్రపత్తులతో నీరాజనాలు సమర్పించారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన రజిత సింహాసనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి, ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాల అనంతరం ఆలయ అర్చకులు, పండితులు శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని పఠించి, రాశి ఫలాలను చదివి భక్తులకు వినిపించారు. ఆ తరువాత శ్రీవారు, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. ఆఖరిలో పండిత సత్కారాలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుకలో ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్‌ఎన్ నివృతరావు, ఈఓ వై.భద్రాజీ, పీపీ రాజు తదితరులున్నారు.
నిత్యకల్యాణ మండపంలో పంచాంగ పఠనాన్ని నిర్వహిస్తున్న పండితులు, అర్చకులు, వేడుకలో పాల్గొన్న భక్తులు


