రొయ్యల రైతుల డిమాండ్లు
భీమవరం: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు గడ్డు పరిస్థితి ఏర్పడటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేకపోగా ఫీడ్, సీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ఎన్నికల్లో కూటమి నాయకులిచ్చిన హామీలు అమలుచేయకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడెక్కి గళమెత్తి నినదించడానికి సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 22న పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో రాష్ట్రస్థాయిలో రొయ్యల రైతుల ఆత్మరక్షణ సమావేశం భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల సమావేశం రాజకీయ పార్టీలకు అతీతమంటూ ప్రచారం చేస్తున్నా దీనికి కూటమిలోని నాయకులే ప్రధాన బాధ్యత వహించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ఈ సమావేశంలో సుమారు 6 వేల మంది రైతులు పొల్గొనే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు రొయ్యల రైతులందరికీ విద్యుత్‌ను యూనిట్ రూ.1.50కు అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సబ్సిడీ విద్యుత్‌ను ఆక్వాజోన్ పరిధిలో రైతులకు అమలుచేయగా టీడీపీ రైతులందరికీ జోన్స్ ప్రమేయం లేకుండా ఇస్తామనడంతో రైతులు సబ్సిడీ విద్యుత్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా హామీ అమలుకాకపోగా ఫీడ్, సీడ్ ధరలు విఫరీతంగా పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతే కాకుండా నాణ్యమైన సీడ్ సరఫరా కాకున్నా ప్రభుత్వం సీడ్‌ను ఉత్పత్తిచేసే హేచరీస్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం రైతులకు కడుపు మంటగా మారింది. దీంతో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోడానికి రంగం సిద్ధం చేశారు. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీలోని నాయకులే నాయకత్వం వహించడం విశేషం.
సమావేశం ఎక్కడంటే...
పశ్చిమగోదావరి జిల్లాలోని మండల కేంద్రమైన వీరవాసరం గ్రామంలోని తులసి కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 9 గంటలకు ఆక్వా రైతుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉభయగోదావరి జిల్లాల రైతులతోపాటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లోని రైతులు భారీగా పాల్గొననున్నారు.
ఫీడ్, సీడ్ ధరలపై ప్రభుత్వం నియంత్రణ ఉండాలి.
రొయ్యలకు కనీస మద్దతు ధర ప్రకటించాలి.
రైతులను మోసం చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వం తక్షణమే రైతులతో సమావేశమై సమస్యలపై చర్చించాలి.
విద్యుత్ సబ్సిడీ రైతులకు వర్తింపజేయాలి.
దేశీయ మార్కెట్‌లో వినియోగం పెంచడానికి చర్యలు చేపట్టాలి, కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన సొమ్మును ఆక్వా రైతు కొనుగోలు చేసే ఆక్వా వస్తువులపై సబ్సిడీ ఇవ్వాలి.
తగ్గిన జీఎస్టీని కంపెనీలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధానమైన అజెండగా సమావేశం నిర్వహిస్తున్నారు.
ఉద్యమం.. ఉధృతం
సమస్యలతో సతమతం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్న వైనం
22న వీరవాసరంలో రాష్ట్రస్థాయి సమావేశం
6 వేల మంది హాజరవుతారని అంచనా


