భీమవరం: శారీరక శ్రమ, మానసిక వికాసంతో విజయాలు అందుకోవాలని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అన్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 46వ వార్షికోత్సవంలో శనివారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను 21వ సంవత్సరం నుంచే సినిమాలు, వినోదాలు వదిలేసి.. దేశానికి విజయాలు అందించడమే లక్ష్యంగా భావించి ఈ స్థాయికి చేరినట్టు ఆమె తెలిపారు. గురువులు, తల్లిదండ్రులు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకొని కఠోర శ్రమ చేస్తే సాధించలేని విజయం అంటూ ఉండదని సూచించారు. ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విజయాలు అందుకోగలరని చెప్పారు. తొలుత సైనా నెహ్వాల్ జ్యోతిప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభానంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ ఎస్‌ఆర్‌కే నిశాంత్‌వర్మ, పాలకవర్గ సభ్యులు, ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.


