డిప్యూటీ స్పీకర్‌పై న్యాయపోరాటం చేస్తా | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ స్పీకర్‌పై న్యాయపోరాటం చేస్తా

Mar 8 2026 7:48 AM | Updated on Mar 8 2026 7:48 AM

ఉండి: తన ఇల్లు, టీడీపీ కార్యాలయం, వంటశాలతో పాటు తన ఆస్తిపాస్తులను ధ్వంసం చేసి తనను నడిరోడ్డుపై నిలబెట్టిన డిప్యూటీ స్సీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజును, అతనికి సహకరించిన అనుచరులు, నాయకులు, అధికారులందరినీ కోర్టు బోనులో నిలబెడతానని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి (ఇతని వ్యతిరేకులు సస్పెండ్‌ చేశామని చెబుతున్నారు) పొత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్యరాజు) స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రులో కూలగొట్టిన ఇల్లు, పార్టీ కార్యాలయ శిథిలాల వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆధారాలతో ఫిర్యాదు..

గత కొద్దిరోజులుగా డిప్యూటీ స్పీకర్‌ వెనుక ఉండి తనపై చేయించిన దురాగతాలను సీసీ ఫుటేజీలు, ఫొటోలు, డాక్యుమెంట్లు సహా ఆధారాలతో జిల్లా ఎస్పీకి శనివారం ఫిర్యాదు చేసినట్టు వెంకటేశ్వరరాజు తెలిపారు. తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పమయంలో తనపై దాడి చేసి, పీకపై కాలువేసి తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అన్నింటినీ సహించి తన బాధనంతటినీ అధినాయకత్వానికి చెప్పుకొన్నానని తెలిపారు. అందుకే తాను న్యాయపోరాటానికి దిగానని చెప్పారు. అవసరమైతే హైకోర్టు వరకు వెళతానని, అక్కడ కూడా తేలకపోతే సుప్రీం కోర్టుకు కూడా వెళతానని తేల్చిచెప్పారు. తనపై ఇంత కక్షగట్టి తనను సర్వనాశనం చేసిన డిప్యూటీ స్సీకర్‌ను కోర్టులో నిలబెడతానని తెలిపారు. ఈ పోరాటంలో తన ప్రాణాలు పోతాయని తెలిసినా తన న్యాయపోరాటం ఆపనని స్పష్టం చేశారు.

నేరుగా ఎస్పీ కార్యాలయానికి..

శుక్రవారం అమరావతిలో అసెంబ్లీ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహం పట్టుకుని నిరసన తెలిపిన తనను సీఎం చంద్రబాబు సూచనల మేరకు పలువురు పార్టీ ఉన్నత నాయకులు రాష్ట్ర కార్యాలయానికి తీసుకువెళ్ళి మాట్లాడినట్టుగా వెంకటేశ్వరరాజు చెబుతున్నారు. అమరావతి నుంచి వచ్చిన అనంతరం ఆయన స్వరం పెంచడమే కాకుండా పనిలో మరింత వేగం పెంచారు. వచ్చీ రాగానే శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఫిర్యాదు కాపీని ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. దాని ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజు, అతని అనుచరులు కొత్తపల్లి నాగరాజు, నడింపల్లి విజయరామరాజు, పవన్‌, డీసీ చైర్మన్‌ తోట ఫణి, కరిమెరక నాగరాజు, కళ్లేపల్లి సతీష్‌రాజు తదితరులతో పాటు తహసీల్దార్‌, ఆయన సిబ్బంది, ఆకివీడు సీఐ జగదీశ్వరరావు (ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు), ఉండి ఎస్‌ఐ ఎండీ నసీరుల్లా, ఆయన సిబ్బంది, ఇరిగేషన్‌ అధికారులు, వారి సిబ్బంది తదితరులపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

టీడీపీ నేత వెంకటేశ్వరరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement