కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై పట్టు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై పట్టు సాధించాలి

Mar 8 2026 7:48 AM | Updated on Mar 8 2026 7:48 AM

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై పట్టు సాధించాలి చెరువులో మునిగి పశువుల కాపరి మృతి అమెరికా దుర్మార్గాలను వ్యతిరేకించాలి

నూజివీడు: విద్యార్థులు తమ కోర్‌ సబ్జెక్టులలో పటిష్టమైన పునాది ఏర్పరచుకోవడంతో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్‌ కొట్టాడ రవిశంకర్‌ సూచించారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో శనివారం ఐఐటీ మద్రాస్‌ మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ (ఎంఎంఈ) విభాగం ఆధ్వర్యంలో అవుట్‌రీచ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలపై రవిశంకర్‌ విద్యార్థులకు అవగాహన కల్పించారు. గేట్‌ అర్హత కలిగిన, బీటెక్‌లో 8.0 సీజీపీఏ, అంతకంటే ఎక్కువ సాధించిన విద్యార్థులకు ఐఐటీ మద్రాస్‌లో అందుబాటులో ఉన్న డైరెక్ట్‌ పీహెచ్‌డీ, ఎంటెక్‌ కోర్సుల గురించి, విద్యార్థులకు అందించే ఆర్థిక సహాయం గురించి వివరించారు. డైరెక్ట్‌ పీహెచ్‌డీ విద్యార్థులకు మొదటి రెండేళ్లపాటు నెలకు రూ.36 వేలు, తరువాత మూడేళ్ల పాటు నెలకు రూ.41 వేలు స్టైఫండ్‌ అందుతుందన్నారు. ఎంటెక్‌ విద్యార్థులకు నెలకు రూ.12 వేలు స్కాలర్‌షిప్‌ అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎంఈ విభాగానికి చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏఓ బీ లక్ష్మణరావు, విభాగాధిపతి ఏ వీరశ్రీను, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి పావని, అధ్యాపకులు డీ మధుసూదన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

ఆగిరిపల్లి: చెరువులో మునిగి పశువుల కాపరి మృతి చెందిన ఘటన శనివారం ఈదులగూడెం గ్రామంలో చోటుచేసుకున్నట్లు ఎస్సై శుభశేఖర్‌ తెలిపారు. గ్రామానికి చెందిన కొలకలూరి రోశయ్య (45) పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం యథావిధిగా గేదెలను మేపడానికి తోలుకువెళ్లగా అవి గ్రామంలో ఉన్న కొత్త చెరువులోకి దిగాయి. వాటిని బయటకు తరిమేందుకు చెరువులోకి దిగిన రోశయ్య చెరువులో ఉన్న గుంతలో ఇరుక్కుపోయి నీటమునిగి మృతి చెందాడు. రోశయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి గాలించిన ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం గ్రామస్తులు, పోలీసుల సహకారంతో కొత్త చెరువులో గాలించగా రోశయ్య మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఏలూరు (టూటౌన్‌): ప్రపంచ శాంతిని భగ్నం చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాద యుద్దోన్మాద దురహంకార వైఖరిని ఖండించాలంటూ శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్‌ వరకు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ లింగరాజు మాట్లాడుతూ ఆయిల్‌ నిక్షేపాల కోసం, ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్న దుర్మార్గాలను వ్యతిరేకించాలన్నారు. అమెరికాను నిలవరించకపోతే మన దేశంపై కూడా దాడి చేసే అవకాశం ఉంటుందని, ప్రభుత్వం ఇప్పటికై నా మేల్కొని సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయుకులు డీఎన్‌వీడి ప్రసాద్‌, ఎం.ఇస్సాక్‌, వైఎస్‌ కనకారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement