ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ నామమాత్రంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ప్రతి వారం వేలాది మంది భక్తులు చినవెంకన్నను దర్శించేవారు. ఈ వారం అంతంత మాత్రంగానే భక్తులు స్వామివారిని దర్శించారు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతుండటం, పదవ తరగతి పరీక్షల సమయం దగ్గర పడటమే భక్తుల రద్దీ తగ్గడానికి కారణమని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని విభాగాల్లో భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది.
ఏలూరు (టూటౌన్) : పెదవేగిలో ఆధునీకరణ టెక్నాలజీతో మరో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రస్తుత ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ఆయిల్ ఫెడ్ వారు లేఖలు రాస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
భీమడోలు: మోటార్‌సైకిల్ చోరీపై భీమడోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈతకోట వారి వీధిలోని బుక్కా దుర్గాప్రసాద్‌కు చెందిన మోటార్‌సైకిల్‌ను ఇంటి వద్దే గత నెల 11వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడు బైక్ ఆచూకీ కోసం గాలించగా ఫలితం లేకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎస్‌కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు (టూటౌన్): వంట గ్యాస్ సిలిండర్‌కు రూ.60, వాణిజ్య సిలిండర్ కు రూ.115 కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి తీవ్రంగా ఖండించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షల నేపథ్యంలో ఈ ధరల పెంపుదల ప్రజలపై శరాఘాతంగా మారిందని అన్నారు. ఈ యుద్ధాన్ని ఖండించి నిలుపుదల చేయించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీతో కలిసి కూటమిగా పరిపాలిస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు గ్యాస్ భారాన్ని తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పేదలకు మెరుగైన వైద్య చికిత్సలను అందించాలని, రోగి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శనివారం ఎన్టీఆర్ వైద్య సేవ ఫిర్యాదులపై డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగుల నుంచి ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు.


