దడ పుట్టిస్తున్న దెయ్యం చేపలు | - | Sakshi
Sakshi News home page

దడ పుట్టిస్తున్న దెయ్యం చేపలు

Mar 8 2026 7:48 AM | Updated on Mar 8 2026 7:48 AM

నియంత్రణే తప్ప నివారణ లేదు

చెరువుల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వైనం

కట్టడి చేయలేక రైతుల గగ్గోలు

గణపవరం: అసలే నష్టాల్లో ఉన్న చేపల సాగు రైతులకు దెయ్యం చేపల బెడద తలపోటుగా తయారైంది. తినడానికి పనికిరాని, అమ్మకానికి పనికిరాని ఈ చేపలు చెర్వుల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి అసలు చేపలకు పోటీగా తయారయ్యాయి. వీటివల్ల రైతులకు కలిగే నష్టం అంతా ఇంతా కాదు. గత దశాబ్ద కాలంగా వీటి బెడద ఆక్వా రైతులను వీడటం లేదు. పెంచుతున్న చేపలకు వేసిన మేతలను ఇవి దర్జాగా తింటూ అసలు చేపలకు అందకుండా చేస్తున్నాయి. దీనితో అసలు చేపల్లో సరైన ఎదుగుదల లేకపోగా, రైతులకు మేతల ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ చేపలు చూడటానికి అందంగానే కనిపిస్తాయి. ఆక్వేరియాలలో సైతం వీటిని ఆసక్తిగా చూస్తుంటాం. అయితే ఇవి చేపల చెర్వులలోకి ఎలా చేరాయోకాని అనతికాలంలోనే సంతానోత్పత్తి పెంచుకుని రైతులకు గుదిబండల్లా తయారయ్యాయి. చేపల పట్టుబడి చేస్తే అసలు చేపలకు సమానంగా ఈదెయ్యం చేపలు వలలో వస్తున్నాయి. వీటిని ఊరి చివరకు తరలించి, గొయ్యి తీసి పాతిపెట్టాల్సి ఉండటంతో రైతులకు మరికొంత ఖర్చు తప్పడంలేదు. ఈ దెయ్యం చేపలు పంట, మురుగుకాల్వల ద్వారా చేపల చెర్వులలోకి ప్రవేశించినట్లు రైతులు చెబుతున్నారు.

పడిపోతున్న దిగుబడులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల ఎకరాల్లో చేపల సాగు జరుగుతుంది. 50 శాతం విస్తీర్ణంలో కట్ల, శీలావతి వంటి తెల్ల చేపలు సాగుచేస్తుండగా మిగిలిన 50 శాతం విస్తీర్ణంలో రూప్‌చంద్‌, ఫంగస్‌, పండుగొప్ప వంటి చేపల సాగు జరుగుతుంది. ఈ చెర్వులో దెయ్యం చేపల సంఖ్య విపరీతంగా ఉండటం వల్ల అసలు చేపల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెర్వులలో వేసే మేతలను ఈదెయ్యం చేపలే ఎక్కువగా తినేస్తున్నాయి. ఈ చేపలకు ముళ్లు ఉండటంతో అసలు చేపలు వీటి దరిదాపులకు వచ్చే అవకాశం ఉండదు. దీనితో దెయ్యం చేపలు తినగా మిగిలిన మేతలే పెంపకం చేపలకు దక్కుతుంది. అందువల్ల అసలు చేపల్లో ఎదుగదల క్షీణించి దిగుబడి తగ్గిపోతుంది. చెర్వులలో 100 గ్రాముల చేపపిల్ల వేస్తే పట్టుబడి సమయానికి కనీస సైజు కిలోనుంచి కిలోన్నర వరకూ ఉండాలి. అయితే దెయ్యం చేపలు ఎక్కువగా ఉన్న చెర్వులలో ఈసైజు పావుకిలో వరకూ తక్కువగా ఉండటంవల్ల రైతులకు నష్టం వస్తుంది. దీనితో ఎకరాకు కనీస స్థాయిలో టన్ను వరకూ దిగుబడి తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. డెల్టా ప్రాంతంలో ప్రతి చెర్వులోనూ వీటిబె దడ ఉన్నా, కొల్లేరు ప్రాంతంలో మాత్రం మరీ ఎక్కువగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరో ముఖ్య విషయం ఏమిటంటే వీటిని చెర్వులలోకి చేరకుండా నియంత్రించడమే మార్గమని, వీటికి నివారణ అంటూ ఏమీలేదని మత్స్యశాఖ నిపుణులు చెబుతున్నారు. ఎన్ని మందులు వాడినా ఇవి చావడం జరుగదని, పట్టుబడి సమయంలో వచ్చినవాటిని గోతిలో పాతిపెట్టాలని రైతులకు సూచిస్తున్నారు. చెర్వులలో నీరు నింపే సమయంలో కాల్వలు, మోటార్ల వద్ద మెష్‌లు ఏర్పాటు చేసి నీటిని ఫిల్టర్‌ చేస్తే కొంతవరకూ ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. అలాగే చేపలు పట్టివేసిన తర్వాత అడుగునీటిలోనూ, ఎలుక కలుగులలోను వీటి ఉనికి ఉందోమో గుర్తించి, ఉంటే వాటిని పట్టివేసిన తర్వాతే కొత్త నీరు నింపుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement