● తాడిపూడి–పోలవరం కాలువల గట్టుపై మట్టి తవ్వకాలు
● పచ్చ నేతలే మట్టి దొంగలు
● పట్టించుకోని అధికారులు
ద్వారకాతిరుమల: కాసుల కోసం కొందరు పచ్చనేతలు మట్టి దొంగలుగా మారారు. అందుకు కాలువ గట్లను ఆదాయ వనరుగా ఎంచుకుని, తమ దందాను దర్జాగా సాగిస్తున్నారు. మట్టి దొంగల చేతిలో పచ్చజెండాలు ఉండటంతో అధికార యంత్రాంగం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుంది. దాంతో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. వివరాల ప్రకారం మండలంలోని తక్కెళ్లపాడులో ఓ టీడీపీ నేత గత కొన్నాళ్లుగా సాగిస్తున్న మట్టి అక్రమ దందాకు అద్దూఅదుపు లేకుండా పోతుంది. గ్రామంలోని తాడిపూడి–పోలవరం కాలువల మధ్య ప్రాంతంలోని గట్టుపై సదరు నేత మట్టిని తవ్విస్తున్నాడు. అలా తవ్విన మట్టిని పగలంతా ట్రాక్టర్ల ద్వారా తరలించి, తన ఇంటి వద్ద ఖాళీ స్థలంలో డంప్ చేయిస్తున్నాడు. అదే మట్టిని రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా భీమవరం, ఉండి, ఏలూరు తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. 9 యూనిట్ల టిప్పర్ మట్టిని రూ. 15 నుంచి రూ.20 వేలకు విక్రయిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇదే నాయకుడు తాడిపూడి కాలువ గట్టుపై అక్రమంగా ఓ భవనాన్ని నిర్మించాడన్న ఆరోపణలున్నాయి.
పథకం ప్రకరమే తవ్వకాలు
సదరు టీడీపీ నాయకుడు ఓ పథకం ప్రకారం ఈ మట్టి దందాను సాగిస్తున్నాడు. పార్టీలోని కొందరు పెద్దల సహకారంతోనే ఇదంతా చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలంతా తవ్విన మట్టిని ట్రాక్టర్ల ద్వారా తన ఇంటి వద్దకు తరలిస్తున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇళ్ల పునాదుల్లోకి, గ్రామ అభివృద్ధి పనులకు తీసుకెళ్తున్నామని చెప్పేందుకే ఇలా చేస్తున్నాడని కొందరు అంటున్నారు. ఇలా పథకం ప్రకారం నిత్యం మట్టిని అమ్ముకుని, సదరు నేత జేబులు నింపుకుంటున్నాడని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు.
పత్తాలేని అధికారులు
ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ తెలియనట్టు నటిస్తున్నారు. దాంతో మట్టి మాఫియాకు అడ్డుకట్ట పడకపోవడంతో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్న పరిసర ప్రాంతాల్లో రీ–సర్వే నిమిత్తం రెవెన్యూ అధికారులు తిరుగుతున్నప్పటికీ.. వారు ఏమీ పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఈ అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.


