కొల్లేరులో కూటమి రాక్షస రాజ్యం | - | Sakshi
Sakshi News home page

కొల్లేరులో కూటమి రాక్షస రాజ్యం

Feb 13 2026 3:14 AM | Updated on Feb 13 2026 3:14 AM

కొల్లేరులో కూటమి రాక్షస రాజ్యం

కొల్లేరులో కూటమి రాక్షస రాజ్యం

కూటమి పాలనలో దురాగతాలెన్నో..

పనికిమాలిన రాజకీయాలు వద్దు

ప్రకృతి అందాలకు నెలవైన కొల్లేరులో కూటమి రాక్షస రాజ్యం సాగుతోంది. పెద్దల కట్టుబాట్లతో ఆచార సంప్రదాయాలు పాటిస్తూ ప్రశాంత జీవనం సాగిస్తున్న లంక గ్రామాల్లో కూటమి నేతలు చిచ్చురేపుతున్నారు. విభజించు.. పాలించు సిద్ధాంతంతో పెట్రేగిపోతున్నారు. ప్రశ్నించిన సర్పంచులపై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నికల సమయంలోనే ఇక్కడ రాజకీయాలు ఉండేవి. ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి జీవనం సాగించేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీసిన వారిపై రౌడీమూకలతో దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. అక్రమ పోలీసు కేసులతో భీతావహ వాతావరణం సృష్టిస్తూ పైశాచికానందం పొందుతున్నారు.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: వేంగి–చాళుక్యుల పాలన నుంచి కొల్లేరు ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. పూర్వపు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 44 దిబ్బలను కొల్లేరు ప్రాంతంగా పరిగణించారు. ఇక్కడి ప్రజలు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆరాధిస్తారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 9 మండలాల్లో 122 గ్రామాల్లో కొల్లేరు ప్రాంతం విస్తరించి ఉంది. ఏలూరు, కై కలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో 80 వేల కుటుంబాలతో సుమారు 3.20 లక్షల మంది జనాభా ఉన్నారు. కొల్లేరు అభయారణ్యాన్ని 77,138 ఎకరాలుగా నిర్ధారించారు.

కట్టుబాట్లకు తూట్లు

కొల్లేరు గ్రామాల్లో ప్రభుత్వానికి సమాంతరంగా ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. గ్రామ జనాభాను బట్టి బంటాలుగా విభజిస్తారు. ఒక్కో బంటాలో 100 నుంచి 50 మంది సభ్యులు ఉండవచ్చు. బంటాకు ఒక నాయకుడు ఉంటాడు. గ్రామంలో అన్ని బంటాలకూ కలిపి పెద్ద వడ్డీ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తాడు. ఇతనికి అనుబంధంగా క్యాషియర్‌, గుమాస్తా, బంట్రోతులు ఉంటారు. కొల్లేరులో చేపల చెరువుల పాటల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామావసరాలు, పెద్ద వడ్డీ, సిబ్బంది జీతాలకు ఉపయోగిస్తారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యులు ఉన్నా పెద్ద వడ్డీ నిర్ణయానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే పోలీస్‌స్టేషన్ల వరకు వెళ్లకుండా రూ.1,000 నుంచి రూ.50 వేల వరకు నగదును తప్పుగా కట్టాల్సి వస్తుంది.

సైదు గంగరాజు స్ఫూర్తి ఇదేనా..

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొల్లేరు పేరు చెప్పగానే పూర్వం ఠక్కున గుర్తుకొచ్చే పేరు దివంగత సైదు గంగరాజు. కొల్లేరు వడ్డీ సామాజికవర్గానికి చెందిన ఆయన అందరూ ఐకమత్యంగా ఉంటూ అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు. నేడు ఆయన ఆశయానికి కూటమి సర్కారు తూట్లు పొడుస్తోంది. ఐక్యతకు మారుపేరైన గ్రామాల్లో రక్తపుటేరులు పారిస్తోంది. హామీలపై ప్రశ్నిస్తే గ్రామస్తులనే పావులుగా చేసుకుని సొంత మనుషులపైనే మూకుమ్మడిగా దాడులు చేయిస్తోంది. పోలీసు స్టేషన్లలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేలా విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటోంది. కేవలం కొల్లేరు అభయారణ్య చెరువుల పేరుతో సాగుతున్న మైండ్‌ గేమ్‌లో కొల్లేరు గ్రామాల్లోని అమాయక బిడ్డలు బలవుతున్నారు.

గత నెలలో ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తూ, సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టినందుకు నత్తగుళ్లపాడు సర్పంచ్‌ ముంగర రామకృష్ణరాజుపై మూకుమ్మడి దాడి జరిగింది. రౌడీ మూకలు ఆయన ఇల్లు ధ్వంసం చేశారు. తిరిగి సర్పంచ్‌పైనే పోలీసులు కేసు నమోదు చేశారు.

2025 మేలో రాజకీయ నాయకుల మాటలు విని కొందరు మహిళలు చటాకాయి సర్పంచ్‌ ఘంటసాల శేషారావుపై కమ్యూనిటీ హాలు వద్ద దాడి చేశారు. దీంతో కొద్దిరోజులకే మనస్తాపంతో సర్పంచ్‌ మృతి చెందారు.

2025 జూలైలో రాజుల కొట్టాడలో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నారని సర్పంచ్‌ కొల్లాటి పద్మావతి, శ్రీనుల కుమారుడు, బంధువులపై ఇదే గ్రామంలో కూటమి నేతలు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

2025 ఆగస్టులో నత్తగుళ్లపాడు యువతిని చటాకాయి యువకుడు ప్రేమించి తీసుకెళ్లాడు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. వారిద్దరినీ తీసుకొస్తుండగా శ్రీపర్రు వద్ద కారు ఆపి నత్తగుళ్లపా డుకు చెందిన వ్యక్తులు ఇతరులతో కలిసి చ టాకాయిలో ముగ్గురు పెద్దలపై దాడి చేశారు.

ఐక్యతకు తూట్లు

నిలదీసిన సర్పంచులపై మూకుమ్మడి దాడులతో బీభత్సం

విభజించు.. పాలించు విధానం అమలు

లంక గ్రామాల్లో కట్టుబాట్లకు చెల్లుచీటీ

వారిలో వారికే విభేదాలు సృష్టించి పైశాచికానందం

పనికిమాలిన రాజకీయాలను పక్కన పెట్టి కష్టాల్లో ఉన్న కొల్లేరు ప్రజల సంక్షేమం కోసం కృషి చేయండి. నత్తగుళ్లపాడు సర్పంచ్‌పై దాడి దురదృష్టకరం. కట్టుబాట్ల గ్రామం అనే నానుడికి ఇటువంటివి మచ్చ. కొల్లేరు నాయకులు కళ్లు తెరవాలి. పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకోవాలి. – చింతపల్లి వెంకటనారాయణ, కొల్లేరుపై పుస్తక రచయిత, కై కలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement