ఊ కొట్టలేదంటే ఊస్టింగే! | - | Sakshi
Sakshi News home page

ఊ కొట్టలేదంటే ఊస్టింగే!

Feb 12 2026 7:30 AM | Updated on Feb 12 2026 7:30 AM

ఊ కొట

ఊ కొట్టలేదంటే ఊస్టింగే!

న్యూస్‌రీల్‌

అక్రమ చేపల సాగుపై అడిగేవారేరి ?

గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: కొల్లేరు అభయారణ్యంలో విధులు నిర్వహించడం అటవీ అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఓ పక్క సిబ్బందికి కష్టమొస్తే ఊరుకోనని అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నా.. అందుకు విరుద్ధంగా ఏలూరు జిల్లాలో రాజకీయ నేతల అండతో కొల్లేరు పెద్దల పంతం నెగ్గుతోంది. తాజాగా రాజమహేంద్రవరం అటవీ శాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు(సీసీఎఫ్‌) బీఎన్‌ఎన్‌ మూర్తి, ఏలూరు జిల్లా అటవీ అధికారి బత్తిన విజయను ఒకేసారి బదిలీ చేశారు. డీఎఫ్‌ఓను రాష్ట్ర ఉన్నతాధికారికి రిపోర్టు చేయమన్నారు. దీంతో ఆ శాఖలో కలకలం రేగింది. అక్రమ చెరువుల విషయంలో ఊ.. కొడితే సరే.. లేదంటే ఊస్టింగే అన్న నానుడి కూటమి ప్రభుత్వంలో మరోసారి రుజువైంది.

అసలేం జరిగిందంటే.. కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల పూర్తి స్థాయి ప్రక్షాళన చేయలేదని, వాటి వివరాలు తెలపాలని సుప్రీంకోర్టు నియమించిన సాధికారిత కమిటీ అటవీ అధికారులను నివేదిక కోరింది. దీంతో కై కలూరు మండలంలో చటాకాయి, కొట్టాడ, పందిరిపల్లిగూడెం వంటి గ్రామాల్లో చెరువులను ధ్వంసం చేయడానికి అటవీశాఖ డీఎఫ్‌వో విజయ, సీసీఎఫ్‌ బీఎన్‌ఎన్‌.మూర్తిలు సిబ్బందితో వెళ్ళారు. ఇప్పటివరకు సాగునకు ఊరుకున్నామని, ఖాళీ చేసిన అక్రమ చేపల చెరువుల్లో తిరిగి జీరో సైజు పిల్ల వేయవద్దని ఫారెస్టు అధికారులు కోరారు. దీంతో కోపమొచ్చిన కొల్లేరు పెద్దలు పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో కొల్లేటికోట వెళ్ళిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ను కొల్లేరు పెద్దలు అటవీ అధికారులను అడ్డుకోలేకపోతున్నారని నిలదీశారు. ఈ నేపధ్యంలో ఇరువురు అటవీ అధికారులపై బదిలీ వేటు పడింది.

గతంలోనూ ఇలాగే..

కొల్లేరులో అటవీ అధికారులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్నారు. 2016లో టీడీపీ పాలనలో అక్రమ చెరువులను అడ్డుకునే అనేక మంది అధికారులను రాజకీయ నాయకులు అక్రమ బదిలీలు చేయించారు. 2014 నవంబరులో తూర్పుగోదావరి జిల్లా నుంచి రేంజర్‌ సునీల్‌కుమార్‌ కొల్లేరులో విధులు నిర్వహించేందుకు వచ్చారు. వచ్చీ రావడమే అక్రమ చేపల చెరువులపై కొరఢా ఝలిపించారు. కొల్లేరు పెద్దలు ప్రజాప్రతినిధుల వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో మూడు నెలలకే బదిలీపై ఆయనను పంపించేశారు. 2016 డిసెంబరు 2న డీఎఫ్‌వోగా వీవీఎల్‌ సుభద్రాదేవి బాధ్యతలు చేపట్టారు. కై కలూరు మండలం చినకొట్టాడ, పెంచికలమర్రు, వడ్లకూటితిప్ప కొల్లేరు అభయారణ్య చెరువుల్లో చేప పిల్లలను వదిలిన 8 వాహనాలను సీజ్‌ చేసి కేసులు పెట్టారు. అంతే ఆమె రెండు వారాల్లోపే సెలవు పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత శివశంకరరెడ్డి డీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టారు. మాటవినకపోతే సెలవు పెట్టి వెళ్ళాలని చెప్పడంతో ఆయన సెలవులోకి వెళ్ళారు. అప్పటి చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టుగా ఎస్‌ఎస్‌.శ్రీధర్‌ కొల్లేరులో బాధ్యతయుతమైన విధులు నిర్వహించారు. ఆయనను అనంతపురానికి బదిలీ చేశారు. అటవీ చట్టాలు, పర్యావరణంపై పూర్తి పట్టున్న ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు (పీసీసీఎఫ్‌) ఏవీ జోసఫ్‌ను బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్‌గా పంపించారు.

కొల్లేరులో మాట వినని ఫారెస్టు అధికారుల బదిలీ

2016 లోనూ ఇంతే

అక్రమ చెరువులకు సహకరిస్తేనే కొల్లేరులో మనుగడ

సుప్రీంకోర్టు నిబంధనలకు నీళ్లు

కొల్లేరు అభయారణ్య విషయంలో వింత వాదన జరుగుతోంది. ఏదైన ఒక వస్తువును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు. కొల్లేరు అభయారణ్యంలో సర్వే నంబర్లు ఆధారంగా వేలాది ఎకరాలు అక్రమ చెరువులు సాగువుతోన్నాయి. అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు వస్తే వస్తువు మాదిరిగా అక్రమ చెరువును తరలించే అవకాశం లేదు. ప్రజలు అడ్డుపడుతోన్నారనే సాకుతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం కొల్లేరులో అక్రమ చెరువుల్లో జీరో సాగు చేప పిల్లలు సాగు చేస్తున్నారు. ఈ నెలలో సుప్రీంకోర్టు కొల్లేరు చెరువులపై తీర్పు వెలువరించనుంది. ఇటువంటి సమయంలో సుప్రీం కోర్టు నియమించిన సీఈసీ కమిటీకి నివేదికలు పంపించే అధికారులను బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడ్డుఅదుపు లేకుండా అక్రమ చెరువులు తవ్వేస్తారని పర్యావరణవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఊ కొట్టలేదంటే ఊస్టింగే! 1
1/1

ఊ కొట్టలేదంటే ఊస్టింగే!

Advertisement
 
Advertisement
Advertisement