అభివృద్ధి పేరిట దోపిడీ
అధికారుల నిర్లక్ష్యం వల్లే..
వందల ట్రాక్టర్ల గ్రావెల్ విక్రయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలుగు తమ్ముళ్ళు కొత్త రకం దందాకు తెరతీశారు. అభివృద్ధి పనులు, మరమ్మతుల ముసుగులో గ్రావెల్ దందా చేస్తూ నిత్యం లక్షలు గడిస్తున్నారు. చెరువు పూడికతీత పేరుతో ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ద్వారా నిధులు మంజూరు చేయించి పనులు పక్కన పెట్టి గ్రావెల్‌తో సొమ్ము చేసుకుంటున్న పరిస్ధితి జిల్లాలో నెలకొంది. ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెంలోని రావులచెరువులో ఈ తరహా దందాను ప్రజాప్రతినిధి అనుచరగణం కొన్ని నెలలుగా సాగిస్తున్నా అధికారులు స్పందించడం లేదు. రెండు రోజులు క్రితం జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ప్రభుత్వాన్ని నిలదీస్తే చర్యలు తీసుకుంటామన్నా పురోగతి లేదు. జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు కొత్త దందాకు తెరదీశారు. ప్రధానంగా కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, దెందులూరు, భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల్లో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. అన్ని చోట్ల ప్రజాప్రతినిధుల ముఖ అనుచర గణం గ్రావెల్ దందా సాగిస్తోంది. అన్నిచోట్ల ఇరిగేషన్ మొదలుకుని రెవెన్యూ అధికారుల వరకు సాగుతున్న అక్రమ దందాపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ మొక్కుబడిగానైనా స్పందించని పరిస్థితి. ద్వారకాతిరుమల మండలంలోని రామన్నగూడెంలోని రావులచెరువు 43.77 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు ఆయకట్టు పరిధిలో 114.98 ఎకరాల సాగు భూమి ఉంది. చెరువు పూడికతీసిన మట్టితో కరకట్టను పటిష్టం చేసి, మరమ్మత్తులకు గురైన సప్లయ్ చానళ్లు, షట్టర్లను బాగు చేసి, మొక్కలు నాటేందుకు, చెరువుకు సంబంధించి అభివృద్ధి పనులు నిర్వహించడానికి కలెక్టర్ వెట్రిసెల్వి ఆమోదంతో మినరల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి రూ.94.30 లక్షల నిధులు మంజూరు చేశారు. జిల్లా మొత్తం మీద సుమారు కోటి రూపాయలు మైనింగ్ నగదును మంజూరు చేసిన ఏకై క చెరువు ఇది. వాస్తవానికి పూడికతీసి కరకట్టల అభివృద్ధి పనులు 3 నుంచి 6 నెలల కాలంలో అన్నింటిని పూర్తి చేయాల్సి ఉంది. తెలుగు తమ్ముళ్లు దీనిని ఆదాయ వనరుగా మలుచుకుని పనులు పక్కనపెట్టి సరికొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారు.
జిల్లాలో అడ్డగోలుగా గ్రావెల్, మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణం. డీఆర్‌సీ సమావేశంలో ద్వారకాతిరుమల మండలం రావులచెరువులో జరుగుతున్న అక్రమ దందాపై సభలో ప్రస్తావించి అధికారులను నిలదీశాం. బహిరంగంగా అందరికి తెలిసేలా గ్రావెల్ దందా జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, చెరువులు ఎందుకు అభివృద్ధి చేయడం లేదని, మంజూరు చేసిన నిధులను ఏం చేశారంటూ ప్రశ్నించాం. రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ మూడు విభాగాలు సంయుక్తపాత్ర ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు.
– ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్
రావులచెరువు పూడికతీత ముసుగులో గ్రావెల్ దందా
చెరువు కరకట్ట పటిష్టానికి
రూ.95 లక్షల మంజూరు
పూడిక తీస్తున్నామంటూ వందల ట్రాక్టర్ల గ్రావెల్ అమ్మకం
స్పందించని అధికార యంత్రాంగం
డీఆర్‌సీలో నిలదీసిన ఎమ్మెల్సీ వంకా రవీంద్ర
ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుల కనుసన్నల్లో చెరువు గ్రావెల్ దందా మొదలైంది. దాదాపు 6–7 నెలల నుంచి 15 క్యూబిక్ మీటర్ల టిప్పర్‌కు రూ.2500, మూడు క్యూబిక్ మీటర్ల ట్రాక్టర్ గ్రావెల్‌కు సుమారు రూ.500 వరకు ప్రజాప్రతినిధులు వసూలు చేస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో గ్రావెల్‌ను లోడ్ చేస్తుంటారు. ప్రత్యేకంగా పొక్లెయిన్ ఏర్పాటు చేసి మరీ పగలూ రాత్రి తేడా లేకుండా చెరువును ధ్వంసం చేస్తున్నారు. ఇంతవరకు వేలాది ట్రిప్‌ల గ్రావెల్‌ను తవ్వేసి కోట్లు గడించారు. ఇదిలా ఉంటే జిల్లాలో ప్రధానంగా కామవరపుకోట, తడికలపూడి, భీమడోలు, ఏలూరు తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లకు గ్రావెల్‌ను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్‌లు పొంది రోడ్ల నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లకు సైతం ఇదే గ్రావెల్‌ను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. భీమడోలు మండలం లింగపాడులో రోడ్డు నిర్మాణం, తిమ్మాపురం నుంచి తిరుమలపాలెం వరకు, అలాగే కొన్ని చోట్ల చేపల చెరువు కరకట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ గ్రావెల్‌ను విక్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు.
అభివృద్ధి పేరిట దోపిడీ
అభివృద్ధి పేరిట దోపిడీ


