కార్మిక సమ్మెను జయప్రదం చేయాలి
ఏలూరు (టూటౌన్): ఈ నెల 12న కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నగరంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్మిక, వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఈనెల 12న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కార్మికులు వందలాది మందితో మున్సిపల్ ఆఫీసు నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఉద్దేశించి ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేస్తూ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు ఉరి తాళ్ల లాంటివని, వీటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12న దేశవ్యాప్త సమ్మెలో గ్రామీణ పేదలు, అసంఘటిత కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోదీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ఐఎఫ్‌టీయు నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.సోమయ్య, యర్రా శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నాయకులు పి.కన్నబాబు, అప్పలరాజు, కడుపు కన్నయ్య, పి.కిశోరు, బాలభాస్కరరావు, కనకదుర్గారావు, బాలాజీ, శంకర్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


