ఆర్థిక అక్షరాస్యత పోస్టర్ల ఆవిష్కరణ
ఏలూరు(మెట్రో): ఆర్‌బీఐ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవ కార్యక్రమాలలో భాగంగా ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు పోస్టర్లను కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమని, సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లు, ఆర్థిక మోసాల నుంచి రక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ వారోత్సవాలలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ ఆర్థిక భద్రతపై బ్యాంకర్లు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఏలూరు (టూటౌన్): పంచాయతీ కార్మికులకు నెల నెల సక్రమంగా జీతాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి పి.కిషోర్ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) కె.అనూరాధకు సోమవారం వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి పి.కిషోర్ మాట్లా డుతూ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు అప్పులు చేసుకుని పస్తులతో బతకాల్సి వస్తుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కనీసం యూనిఫాం, చెప్పులు, కొబ్బరి నూనె, చేతి గ్లౌజులు వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. తక్షణమే జిల్లాలో బకాయిపడిన పంచాయతీల్లో కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. డిపిఓ స్పందిస్తూ జిల్లాలో వివిధ పంచాయతీల్లో బకాయిలను మార్చి నెలాఖరుకు క్లియర్ చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఏలూరు (టూటౌన్): గత ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు వాగ్దానం చేసిన విధంగా తక్షణం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కో కన్వీనర్ తొర్లపాటి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతిపత్రం సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కూటమి పెద్దలు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, నిరుద్యోగ యువతకు శిక్షణ, ప్రోత్సాహకాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడచినా కూడా ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో వలంటీర్లకు ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ మెంబర్ కురెళ్ళ వరప్రసాద్, బొల్లవరపు శేఖర్ పాల్గొన్నారు.
ఆర్థిక అక్షరాస్యత పోస్టర్ల ఆవిష్కరణ
ఆర్థిక అక్షరాస్యత పోస్టర్ల ఆవిష్కరణ


