గంగానమ్మకు ఘనంగా వీడ్కోలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలో గత మూడు నెలలుగా భక్తుల విశేష పూజలందుకున్న శ్రీ గంగానమ్మ అమ్మవారికి సోమవారం నగర ప్రజలు అత్యంత వైభవంగా వీడ్కోలు పలికారు. తూర్పు వీధి, దక్షిణపువీధి, పవరుపేట, లక్ష్మివారపుపేట, ఆదివారపుపేటలతో పాటు పడమరవీధి ప్రాంతాల్లో గత వంద రోజులకు పైగా భక్తిశ్రద్ధలతో కొలిచి గత నెల 26, ఈ నెల 2 తేదీల్లో అమ్మవారిని సాగనంపగా తంగెళ్ళమూడి ప్రాంతంలో చివరిసారిగా అమ్మవారికి సోమవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
భారీ ఎత్తున ఊరేగింపు
తంగెళ్ళమూడిలో ఏర్పాటు చేసిన శ్రీ గంగానమ్మ అమ్మవారి మేడల నుంచి అమ్మవారిని కొర్లబండిపై నగర శివార్లకు సాగనంపే ప్రక్రియ నేత్రపర్వంగా జరిగింది. ఊరేగింపులో కొర్లబండిపై అమ్మవారి వేషధారణలో పంబల వారు కూర్చొని భక్తులకు కుంకుమబొట్లు పెడుతూ ఆశీర్వదిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తీన్మార్ డప్పులు, డీజేలు, నృత్యాలు, బుట్టబొమ్మలు, శక్తి వేషధారులతో ఊరేగింపు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
ఊరేగింపు సాగిందిలా..
జాతర మేడల నుంచి అమ్మవారి కొర్ల బండి ఊరేగింపు ప్రారంభమై అక్కడి నుంచి మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం మీదుగా వేణుగోపాల స్వామి ఆలయం, స్వాతి టవర్స్, అంగడాల ప్లాట్స్, చెరువుగట్టు రోడ్డు, బీడీ కాలనీలోని కనకదుర్గమ్మ ఆలయం, ఆర్‌కే ఫ్యాషన్స్ వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి చింతలపూడి రోడ్డులోకి ప్రవేశించి బాబూ జగజ్జీవన్ రామ్ కమిటీ హాలు మీదుగా రాణీ నగర్‌లోని రామాలయం వద్దకు చేరుకుని జంగారెడ్డిగూడెం రోడ్డులోకి ప్రవేశించింది. చివరిగా జంగారెడ్డిగూడెం రోడ్డులోని టాటా మోటార్స్ షోరూం సమీపంలో అమ్మవారిని పొలిమేరలు దాటించి అక్కడ అమ్మవారిని విడిచి వచ్చారు.
నగరంలో భారీ ఊరేగింపు
గంగానమ్మకు ఘనంగా వీడ్కోలు
గంగానమ్మకు ఘనంగా వీడ్కోలు


