భోగి మంటల్లో ప్రైవేటీకరణ జీఓలు
● వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్
● చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన జీవోల దహనం
సాక్షి, భీమవరం/కై కలూరు: వైద్య విద్యను ప్రైవేట్‌పరం చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వం పోకడలపై ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ ఎడతెగని పోరాటం చేస్తోంది. ప్రైవేటీకరణ కోసం విడుదల చేసిన జీవోల ప్రతులను బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు భోగి మంటల్లో దహనం చేశారు. ప్రభుత్వం వెనుకడుగేసేంత వరకూ పోరు ఆపేది లేదని స్పష్టం చేశారు. కై కలూరులోని పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు, కై కలూరు కో–ఆర్డినేటర్ దూలం నాగేశ్వరరావు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి జీఓ ప్రతులను దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎన్నార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి 17 వైద్య కాలేజీలను తీసుకొచ్చారని.. వీటిని ప్రైవేటు పరం చేయడం వల్ల పేదలకు వైద్య సేవలు దూరమవుతాయన్నారు. ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఎలాంటి సంస్థలు ముందుకు రాకపోవడం ఈ విధానంపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు అధ్యక్షుడు జి.శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మున్నూరు జాన్ గురునాథ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు భోగి మంటల్లో జీఓ ప్రతులను దగ్ధం చేశారు. చింతలపూడి మండలం ఫాతిమాపురంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు కారుమూడి వెంకటరెడ్డి, ఆర్.శ్యామల భోగి మంటల్లో జీవో ప్రతులను వేసి దహనం చేశారు.


