సమష్టి కృషితో నేరాల నియంత్రణ
ఏలూరు టౌన్: జిల్లాలో పోలీస్ యంత్రాంగం సమష్టిగా, పటిష్టమైన ప్రణాళికతో నేరాలను నియంత్రించడంలో కృషి చేసినట్టు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. బుధవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వార్షిక వివరాలను ఆయన వెల్లడించారు. ఏలూరు గ్రీన్ సిటీలో రహస్యంగా షెల్టర్ తీసుకుంటున్న 15మంది మావోయిస్టులను చాకచక్యంగా ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా అరెస్ట్ చేయడం పోలీస్ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో హత్య, కిడ్నాప్, లైంగికదాడులు, పోక్సో కేసులు, వైట్‌కాలర్ నేరాలు, అట్రాసిటీ కేసులు 2024తో పోలిస్తే 2025లో తగ్గాయన్నారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్, డీసీఆర్‌బీ సీఐ హబీబ్ భాష, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు ఉన్నారు.
చోరీ కేసుల్లో భారీ రికవరీ
జిల్లాలో చోరీ కేసుల్లో పోలీస్ అధికారులు భారీగా సొమ్ము రికవరీ చేశారు. ఇళ్లలో చోరీలు 2025లో 44 కేసులు, 2024లో 56 కేసులు నమోదయ్యాయి. ఇక సాదారణ దొంగతనాలు 2025లో 699 నమోదు కాగా, 2024లో 681 కేసులు ఉన్నాయి. ఈ ఏడాది చోరీ కేసుల్లో రూ.4 కోట్ల 26 లక్షల సొమ్మును రికవరీ చేశారు.సైబర్ క్రైమ్‌లో 61 కేసుల్లో సుమారు రూ.20కోట్లు సొమ్ము ఆయా ఖాతాల్లో హోల్డ్ చేయగా, రూ.22.70 లక్షల సొమ్ము బాధితులకు అందజేశారు. జిల్లాలో సీసీఎస్, సైబర్‌సెల్ సంయుక్తంగా 4,038 సెల్‌ఫోన్లు రికవరీ చేయగా వీటి విలువ రూ.5.33 కోట్లుగా అంచనా.
పెరిగిన రోడ్డు ప్రమాదాలు
2025లో వాహన ప్రమాదాలు 713 నమోదైతే, 2024లో 595 కేసులు నమోదు అయ్యాయి.
మద్యం, జూదం కేసులు
జిల్లాలో నాటుసారా తయారీదారులు, అక్రమ మద్యం రవాణా చేసేవారిపై 70 కేసులు నమోదు చేసి 80 మంది నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయి రవాణా చేస్తోన్న వారిపై 15 కేసులు నమోదు చేసి 49 మంది నిందితులను అరెస్ట్ చేసి, రూ.49.62 లక్షల విలువైన 505 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నార. గంజాయి కేసుల్లో 12 వాహనాలు సీజ్ చేశారు. 938 పేకాట కేసుల్లో 3,816 మంది అరెస్ట్ చేసి రూ.69.67 లక్షలు, 361 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ శివకిషోర్


