14 నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
నరసాపురం: నరసాపురం రుస్తుంబాదలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతీయస్థాయి పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు జనవరి 14 నుంచి 18వతేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది వలె 32వ జాతీయస్థాయి ఇన్విటేషన్ కప్ కబడ్డీ పోటీలు ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం గోగులమ్మ ఆలయం వద్ద విలేకరుల సమావేశంలో పోటీల కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్, జాతీయ కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి వి.వీర్లెంకయ్య టోర్నమెంట్ వివరాలు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి పురుషుల విభాగంలో 20, మహిళల విభాగంలో 20 మొత్తం 40 జట్లకు ఆహ్వానం పంపామని చెప్పారు. ఫ్రొకడ్డీ పోటీల్లో ఆడిన ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారని చెప్పారు. లీగ్‌కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతుతాయన్నారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.1.50 లక్షలు, రెండో బహుమతిగా రూ.లక్ష, మూడవ బహుమతిగా రూ.75 వేలు, నాల్గో బహుమతిగా రూ.50 వేలు పురుషులు, మహిళల విభాగాల్లో అందిస్తామన్నారు. 50 మంది రిఫరీలు, ఆటగాళ్లు, సిబ్బంది కలిపి 500 మంది పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


