గంజాయి పట్టివేత
బుట్టాయగూడెం: ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 10.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం జీలుగుమిల్లి సర్కిల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం సరిహద్దు ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనం సీటు కింద గంజాయి ప్యాకెట్‌లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. నిందితులిద్దరూ ఒడిశా బోర్డర్ పరిసర ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి కామారెడ్డి వైపు అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైందని అన్నారు. పట్టుబడిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు. రాజ్‌పుత్ కమల్‌సింగ్, ఆకుల వంశీలను గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠా, ఇతరుల పాత్రపై విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
భీమడోలు: పూళ్లలో వివాహిత అదృశ్యం కేసుపై భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గ్రామానికి చిగురుపాటి హరిబాబు తన భార్య శనివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఆచూకీ దొరకలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యాభర్తలు గొడవ పడడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిసింది. పరిసర గ్రామాల్లో వెదికినా ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో భర్త పేర్కొన్నాడు.


